ఉచిత నైపుణ్య శిక్షణతో యువతకు ఉపాధి బాట
అవకాశాలను సద్వినియోగం చేసుకుని సొంత కాళ్లపై నిలబడాలి:ఇచ్చోడ సీఐ నరేష్ కుమార్
ఇచ్చోడ, ఆగస్టు 10 : గ్రామీణ ప్రాంత యువతీ, యువకులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు సొంత కాళ్లపై నిలబడాలని ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) నరేష్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకు అందిస్తున్న ఉచిత వృత్తి విద్య, నైపుణ్య శిక్షణ కోర్సులకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు ఉచితంగా సాంకేతిక, వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తూ వారిని ఉపాధి వైపు నడిపించేందుకు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. చదువు పూర్తిచేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.
శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజనం సదుపాయాలు కల్పించడంతో పాటు యూనిఫాం, షూస్, బ్యాగ్ తదితర మెటీరియల్ను ఉచితంగా అందజేస్తారని తెలిపారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఎన్ ఎస్ డీ సీ గుర్తింపు పొందిన సర్టిఫికెట్ అందించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు.
- 18 నుంచి 35 ఏళ్ల వారికి అవకాశం
18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులు శిక్షణకు అర్హులని ఆదిలాబాద్ జిల్లా కమ్యూనిటీ మొబిలైజర్ పసుల రమేష్ తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వారితో పాటు ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంఓఏ కంప్యూటర్ ట్రైనింగ్, సోలార్ టెక్నీషియన్, ఆటోమోటివ్ (టూ వీలర్, ఫోర్ వీలర్ మెకానిక్), హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, ఎలక్ట్రికల్ అండ్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, హెల్త్కేర్ (జీడీఏ, నర్సింగ్ అసిస్టెంట్), బ్యూటీ అండ్ వెల్నెస్ తదితర కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు 6303603145లో సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కమ్యూనిటీ మొబిలైజర్ పసుల రమేష్, తుక్కరెడ్డి రాజేందర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.






