పీఆర్సీ ఎప్పుడు?
- ఇంకా ప్రభుత్వానికి చేరని పీఆర్సీ నివేదిక
- నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించి 25 రోజులు
- అందిన ఆరు నెలల్లోపు పీఆర్సీ అమలు చేయాల్సిందే అంటున్న ఉద్యోగులు
ఈనెల 2న జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగ జేఏసీ నేతలు సీఎం ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లలో పీఆర్సీ ఒకటి. జూన్ 2 లోపు పీఆర్సీ కమిటీ నుంచి నివేదికను తెప్పించుకోవాలని ముఖ్యమంత్రికి ఆరోజు జేఏసీ నేతలందరూ విజ్ఞప్తి చేశారు. బదులుగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ పీఆర్సీపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారుల కమిటీని ఆదేశించారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని జేఏసీ నేతలకు మాటిచ్చారు.
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ఉద్యోగ, పెన్షనర్ల పరిస్థితి ఎలా తయారైందంటే.. ఇప్పటికిప్పుడు తమకు పీఆర్సీ ప్రకటించకున్నా పర్వాలేదు కానీ.. కనీసం జూన్ 2 రాష్ట్ర అవతరణ రోజు వరకైనా పీఆర్సీ కమిటీ నుంచి నివేదిక తెప్పించుకోవాలని కోరుతున్నారు. ఆ నివేదిక తెప్పించుకుంటే తర్వాత ఎలాగైనా దాన్ని అమలు చేయించుకోవచ్చుననేది ఉద్యోగుల ఉద్దేశం. కానీ ఇప్పటివరకు ప్రభుత్వానికి ఇంకా పీఆర్సీ నివే దిక అందలేదని ఉద్యోగ జేఏసీ నేతలు చెప్తున్నారు.
ఈనెల 2న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డియే.. తక్షణమే పీఆర్సీ నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించడంతో కనీసం నాలుగైదు రోజుల్లో నైనా ఆ నివేదిక ప్రభుత్వానికి చేరుకుంటుందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలంతా భావించారు. కానీ ఈ సమావేశమై 25 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆ నివేదిక చేరకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో గందరగోళం ఏర్పడింది. జూన్ 2న వరకైనా దీనిపై స్పష్టత వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే పీఆర్సీ నివేదిక తెప్పించుకోవడానికే ఇంతేసి సమయం పడుతుంటే ఇక దాన్ని అమలు చేయడానికి ఇంకెంత సమయం వేచిచూడాలోనని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పీఆర్సీ నివేదిక ఎప్పుడో సిద్ధమైందని పలువురు ఉద్యోగ జేఏసీ నేతలు అంటున్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు ఆ నివేదికను తెప్పించుకోవడంలేదో అర్థం కావడంలేదని వారు అంటున్నారు. ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తుందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఈ నివేదికను తెప్పించుకుంటే, ఆ తర్వాత ఆరు నెలల్లోపు అమలుచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కొంత సమయం వేచి చూద్దామని జేఏసీ ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది చివరి వరకు..
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారంతో తల మునకలై ఉన్నదన్న విష యం అందరికి తెలిసిందే. అలాంటిది ఇప్పట్లో పీఆర్సీని అమలుచేయాలంటే అది ప్రభుత్వంపై అదనపు భారమే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నెలలుగా ఉద్యోగుల పెండింగ్ బిల్లులను చెల్లించుకుంటూ వస్తోంది. పైగా ఈనెల 2న.. 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ. 6 వేల కోట్లు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీనికితోడు ఉద్యోగులు ఏకంగా 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆ ర్సీని ప్రకటించాలని కోరుతున్నారు.
కనీసం ఒక శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నా, ప్రభుత్వంపై సుమారు రూ. 400 కోట్ల భారం పడుతుంది. కానీ ప్రభుత్వం 30 శాతం లేదా 20 శాతం ఇచ్చినా స్వాగతించేందుకు ఉద్యోగులు సిద్ధంగానే ఉన్నారు. ఒక వేళ పీఆర్సీ నివేదికను ప్రభుత్వం తెప్పించుకున్నా, ఆ నివేదిక ఆధారంగా పీఆర్సీని ప్రకటించాలంటే ఆగస్టు లేదా డిసెంబర్ వరకు ఉద్యోగులు వేచిచూడాల్సిందే. డీఏలను పీఆర్సీలో కలుపుతారా? లేదా? అనేదానిపైన కూడా ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. కొత్త పీఆర్సీని 2023 జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాల్సి ఉంది.






