10 March, 2026 | 4:35 AM

విలీనమెప్పుడు?

10-03-2026 02:58 AM

ఆర్టీసీ జేఏసీ డిమాండ్లు ఇవీ..

1. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంచేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.

2. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలుచేయాలి.

3. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ప్రతినెలా రూ. 350 కోట్లు కోత విధించ కుండా చెల్లించాలి.

4. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

5. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలి. గుర్తింపు సంఘ ఎన్నికలను నిర్వహించాలి.

6. అన్ని కేటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలి.

7. ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలుచేసి ఆర్టీసీకి ఇవ్వాలి. ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సులకు ఇవ్వరాదు.

8. మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి.

9. రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. అన్ని కేటగిరీలలోని ఖాళీలను భర్తీచేయాలి.               

10. రిటైరైన ఉద్యోగుల బకాయిలను అన్నింటినీ చెల్లించాలి.

11. హయ్యర్ పెన్షన్ రిజెక్ట్ అయినవారికి హయ్యర్ పెన్షన్ పొందేందుకు మరొక అవకాశం ఇవ్వాలి.

12. ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి రెగ్యులర్ నియామకాలు జరపాలి.

* 37 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల ఎదురుచూపులు

* ఆర్టీసీని ప్రైవేటీకరించకుండా.. ఎలక్ట్రిక్ బస్సులను యాజమాన్యమే కొనుగోలు చేసి నడపాలి

* పెండింగ్ సమస్యలపై 13న సమ్మె.. ఆర్టీసీ జేఏసీ నోటీసులు

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేరడంలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం..  కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ గాలిలో పెట్టిన దీపంలా ఉంది. దాదాపు 37 వేల మంది కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తారని కళ్లల్లో వత్తులువేసుకొని ఎదురుచూ స్తున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లోనైనా దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  తమ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ ఈనెల 13న సమ్మె నోటీసులిచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

జీవో విడుదలెప్పుడు..?

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్రను నాడు గుర్తించిన కేసీఆర్.. విలీనానికే మొగ్గు చూపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చే యాలని నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలోనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీ నం చేసేలా అప్పటి ప్రభుత్వం 2023లో అసెంబ్లీలో బిల్లును కూడా ఏకగ్రీవంగా పాస్ చేయించింది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం పొంది సెప్టెంబర్‌లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

కానీ, ఇప్పటి వరకు అపాయింటెడ్ డే ప్రకటించలేదు. దాని విధివిధానాల కోసం వేసిన కమిటీ ఇప్పటివరకు ఈ అంశాన్ని కొలిక్కి తీసుకురాలేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ ఉద్యో గులుగా గుర్తిస్తూ సర్కారు జీవో విడుదల చేయకుండా తాత్సారం చేస్తోందని కార్మికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తు న్నారు. అప్పట్లోనే ఉద్యోగుల అపాయింట్‌మెంట్ డే ఉంటుందని కేసీఆర్ 2023 అక్టో బర్‌లోనే ప్రకటించారు. అయితే, అనూహ్యంగా అక్టోబర్ 18న ఎన్నికల కోడ్ రావ డంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అప్పటినుంచి ఉద్యోగులు విలీనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

అపరిష్కృతంగానే సమస్యలు..

అపరిష్కృతంగా ఉన్న సమస్యపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకో కపోవడంలేదని కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయకుండా అవసరమైనమేరకు ఎల క్ట్రిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యమే కొనుగోలు చేసి నడపాలని వారు కోరుతున్నారు. 2021 వేతన సవరణ ఇంతవరకు చేపట్టలేదు. దీని గడువు ముగిసి కూడా దాదాపు ఐదేళ్లవుతోంది. ఆర్టీసీకు ఉన్న అప్పులను చూపిస్తూ వేతన సవరణ, పెండింగ్ బకాయిలు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.

దీనికితోడూ మహాలక్ష్మి పథకం కింద రావాల్సిన నిధులు ఆర్టీసీలో జమకావడంలేదు. దీంతో ఈ బకాయిలు దాదాపు రూ. 2,700 కోట్లకు పేరుకుపోయాయి. గత 2014 నుం చి ఇప్పటివరకు సుమారు 17 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. అయితే వీరి స్థానంలో కొత్త వారిని నియమించకుండా ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను అమ లు చేస్తుండటాన్ని కార్మిక సంఘాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆరేడేళ్లుగా ఆర్టీసీ సూపర్‌వైజర్ పోస్టులను కూడా భర్తీ చేయలేదు. 

మాకెందెకు ఎన్నికలు పెట్టరు?

మీరు స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు, పార్టీ అనుబంధ సంఘాల ఎన్నికలు నిర్వహిం చుకుంటారు. కానీ ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు ఎందుకు పునరుద్ధరించరు. మాకు ఏమైనా కష్టాలు, సమ స్యలుంటే వాటిని గుర్తింపు సంఘాల ద్వారా ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొద్దా?. ఒక్క పైసా ఖర్చు కూడా కాని ఈ అంశాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదు.

ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనానికి గత ప్రభుత్వం గెజిట్ విడుల చేసింది. దీనికి సంబంధించిన జీవోను ఈ ప్రభుత్వం ఇంతవరకు విడుదల చేయలేదు. మెట్రోను విలీనం చేసినప్పుడు ఆర్టీసీని ఎందుకు విలీనం చేసుకోరు. ఆర్టీసీ అప్పుల్లో ఉందనే సాకుతో తమకు జీతాలు కూడా పెంచడంలేదు.

ప్రభుత్వ ఉద్యోగుల కంటే తమకు 28 శాతం తక్కువ జీతాలున్నాయి. 90 వేల కోట్ల అప్పులో ఉన్న విద్యుత్ సంస్థలో ఓ స్వీపర్‌కు రెండు లక్షల జీతం ఉన్నప్పుడు.. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఎందుకు పెరగవు. అదనపు పనిభారంతో వెట్టిచాకిరి చేస్తున్నా జీతాలు ఎందుకు పెంచరు?. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తున్నారు. సమ్మెకు మిగతా సంఘాలు కూడా మాతో కలిసి రావాలని కోరుతున్నాం.

 ఈదురు వెంకన్న, ఆర్టీసీ జేఏసీ చైర్మన్

న్యాయం చేస్తామన్నారు.. ఏదీ?

మాకు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో అనేక హామీలను ఇచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులు మాకు ఓట్లు వేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే న్యాయం చేస్తామన్నారు. అలాగే కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపర్చారు కూడా. ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే ఓ సందర్భంలో మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగులు వారియర్స్‌గా పనిచేశారన్నారు. మరి మాకిచ్చిన హామీలు ఇంత వరకు అమలు చేయనేలేదు.

ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. గతంలో సమ్మె నోటీసులిచ్చినప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ మాకు ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదు. దీంతోనే మళ్లీ ఆందోళన బాట చేపడుతున్నాం. మమ్మల్ని అన్యాయం చేయకండి. ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. మీరిచ్చిన వాగ్దానాలే అమలుచేయాలంటున్నాం. సమ్మెకు పోకుండా పిలిచి సమస్యలు పరిష్కరించాలి. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకండి.

 ఎం.థామస్ రెడ్డి, ఆర్టీసీ జేఏసీ వైస్ ఛైర్మన్