30 April, 2026 | 3:38 AM

బంగాల్‌లో బీజేపీ హవా?

30-04-2026 02:45 AM

బంగాల్‌లో బీజేపీ, టీఎంసీ నువ్వానేనా!


* పశ్చిమ బంగాల్‌లో తుది విడత..  రికార్డు స్థాయిలో 92.47 శాతం పోలింగ్ జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. బంగాల్‌లో బీజేపీ, అధికార టీఎంసీకి చాలెంజ్ విసురుతున్నది!. కేరళంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ హోరాహోరీగా ఉన్నాయి. తమిళనాట విజయ్ అధికారంలోకి వచ్చినా  ఆశ్చర్యం లేదని కొన్ని సర్వే సంస్థలు పేర్కొన్నాయి.

  1. తమిళనాట మళ్లీ డీఎంకేకే పీఠం
  2. కేరళంలో అనూహ్య ఫలితం?
  3. అధికార ఎల్డీఎఫ్ కూటమికి షాక్! 
  4. యూడీఎఫ్‌కు పట్టం కట్టే అవకాశం 
  5. అసోంలో మళ్లీ బీజేపీదే అధికారం

న్యూఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ముగిసినా ఇంకా రాజకీయ వేడి తగ్గలేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఈ వేడిని మరింత పెంచాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పలు రాష్ట్రాల్లో అనూహ్య ఫలితాలు వస్తాయని అంచనా వేశాయి. ముఖ్యంగా మొదటినుంచీ చర్చనీయాంశంగా మారిన పశ్చిమ బంగాల్‌లో అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య నువ్వానేనా అన్నట్లు పోరు సా గినట్లు తెలుస్తున్నది.

ఆ రాష్ట్రంలో టీఎంసీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్, పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేయగా, బీజేపీ తొలిసారిగా అధికారంలోకి వస్తుందని మాట్రిజ్, పీ మార్క్ అంచనా వేశాయి. ఇక, తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ తిరిగి పీఠం దక్కించు కుంటుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.

మరోవైపు కేరళంలో అనూహ్య ఫలితం వస్తుందని అన్ని సంస్థలు అంచనా వేశాయి. అధికార కూటమి ఎల్డీఎఫ్ ఓటమి పాలవుతుందని, యూడీఎఫ్ సర్కార్ రావడం ఖా యమని అన్ని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో తెలిపాయి. అసోంలో బీజేపీ అధికారాన్ని నిలుపుకొంటుందని అన్ని సంస్థలు అంచనా వేశాయి.  కాగా, మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. 

తమిళనాడులో..

తమిళనాట మరోసారి అధికార డీఎంకేదే హవా నడిచినట్టు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. ముక్కోణపు పోరులో స్టాలిన్ నేతృత్వంలోని కూటమి విజయ దుందుభి మోగించనుందని అంచ నా కట్టాయి. మాట్రిజ్ సంస్థ డీఎంకే కూట మి 122-132 సీట్లు, అన్నాడీఎంకే కూటమి 87-100 స్థానాలు సాధిస్తాయని చెప్పింది. డీఎంకే  కూటమి 148-168 స్థానాలు కైవసం చేసుకొని భారీ విజయం సొంతం చేసుకుంటుందని ప్రజాపోల్ తెలిపింది.

అయితే, ఎన్డీటీవీ-యాక్సిస్ మైఇండియా మాత్రం 98-120 స్థానాలతో నటుడు విజయ్ పార్టీ టీవీకే అధికారంలోకి వస్తుందని చెప్పడం విశేషం. టీవీకే రెండంకెల సీట్లతో మూడో స్థానానికే పరిమితమవుతుందని మెజారిటీ సర్వేలు అంచనా వేశాయి. కాగా, ఈ రాష్ట్రం లో మొత్తం 234 స్థానాలుండగా, అధికారం చేపట్టాలంటే 118 స్థానాలు అవసరం. మే 4న తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.

పుదుచ్చేరిలో..

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అధికార కూటమి మరోసారి అధికారంలోకి రావచ్చని అంచనాలు వెలువడ్డాయి. ఆలిండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి 19-25 స్థానాలతో అధికారం చేపడుతుందని ప్రజాపోల్ అంచనా వేసింది.

కేరళంలో..

కేరళంలో సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ కూటమికి ఎదురుదెబ్బ తగులుతుందని మెజారిటీ సంస్థలు అంచనా వేశాయి. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కారు దిగిపోవడం ఖాయమని తెలుస్తున్నది. యూడీఎఫ్ కూటమి 78-90 స్థానా లు కైవసం చేసుకుంటుందని యాక్సిస్ మైఇండియా తెలిపింది.

అసోంలో..

ఈశాన్య రాష్ట్రం అసోంలో మరోసారి గత ఫలితాలే వస్తాయని తెలుస్తున్నది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే అధికారం నిలబెట్టుకుంటుందని మెజారిటీ సంస్థలు చెప్పా యి. బీజేపీ కూటమి 88-100 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని యాక్సిస్ మైఇండియా అంచనా వేసింది.

పశ్చిమ బంగాల్‌లో..

పశ్చిమ బంగాల్‌లో హోరాహోరీ పోరు సాగినట్టు మెజారిటీ సంస్థలు తెలిపాయి. ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే పార్టీ స్వల్ప మెజారిటీతోనే అధికారంలోకి వస్తుందని అంచనాలు వెలువడ్డాయి. ఈ రాష్ట్రం లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు 148 స్థానాలు అవసరం.

కాగా, టీఎంసీ 177-187 స్థానాలు కైవసం చేసుకుంటుందని, బీజేపీ 95- 110 సీట్లు పొంద వచ్చని పీపుల్స్ పల్స్ తెలిపింది. టీఎంసీ 146, బీజేపీ 140 స్థానాల్లో గెలుస్తాయని పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. ఇక మ్యాట్రిజ్ బీజేపీ 146-161 స్థానాలు సాధిస్తుందని చెప్పగా, బీజేపీ 150-175 స్థానాలు సాధిస్తుందని పీ-మార్క్ చెప్పింది. 

బంగాల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ - టీఎంసీ 146, బీజేపీ 140 

పీపుల్స్ పల్స్ -- టీఎంసీ: 177--187, బీజేపీ 95-1-10 

మ్యాట్రిజ్ -- టీఎంసీ : 125--140; బీజేపీ : 146-161 

చాణక్య స్ట్రాటజీస్ -- టీఎంసీ: 130--140; బీజేపీ 150--160 

పీ మార్క్ -- టీఎంసీ : 118--138; బీజేపీ : 150--175 

పోల్ డైరీ - టీఎంసీ : 99- బీజేపీ : 142

తమిళనాడు ఫలితాలు

పీపుల్స్ పల్స్ -- డీఎంకే: 125-145;

అన్నాడీ ఎంకే+: 65--80

మ్యాట్రిజ్ - డీఎంకే+: 122--132; అన్నాడీఎంకే: 87--100

పీపుల్స్ ఇన్సైట్ -- డీఎంకే+: 120-140; అన్నాడీఎంకే 60--70, 

పీమార్క్  డీఎంకే+: 125 అన్నాడీఎంకే+: 65