30 April, 2026 | 3:38 AM

‘బాల్‌కిషన్’ వెళ్లిపోయారు!

30-04-2026 02:50 AM
  1. రచయిత తెలిదేవర భానుమూర్తి కన్నుమూత
  2. తన రచనల్లో విస్తృతంగా తెలంగాణ మాండలికం
  3. రచనా శైలిలో వ్యంగ్యం, హాస్యం ఆయన ప్రత్యేక
  4. పత్రికారంగంలో 50 ఏళ్లకు పైగా సేవలు
  5. తొలితరం తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు
  6. ఎన్నో ఉద్యమాల్లో భాగస్వామి.. కొంతకాలంపాటు జైలు జీవితం
  7. ఆయన మృతి.. సాహితీలోకానికి తీరని లోటు

హైదరాబాద్, (ఏప్రిల్ 29): ప్రముఖ రచయిత, పాత్రికేయుడు తెలిదేవర భానుమూర్తి (73) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో సతమవుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పత్రికా రంగంలో భానుమూర్తి సుమారు ఐదు దశాబ్దాల పాటు పనిచేశారు.

తెలంగాణ మాండలికాన్ని చిన్నచూపుగా చూసే కాలంలోనే ఆయన ఆ మాండలికంలో విస్తృతంగా రచనలు చేశారు. తన వ్యాసాలు, నవల లు, కథలు ఇక్కడి మాండలికంలోనే రాశారు. ఆయన మృతి తెలంగాణ సమాజానికి, సాహితీ లోకానికి తీరని లోటు. భానుమూర్తి 1953 జనవరి 16న భువనగిరిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు తెలిదేవర వెంకట్రావు, సీతమ్మ. యాదగిరిగుట్ట, ఆర్మూర్, భువనగిరి ప్రాంతాల్లో భానుమూర్తి విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీజీ పట్టా పొందారు.

చిన్నతనం నుంచే ఆయనకు చదువు పట్ల ఎంతోఆసక్తి ఉండేది. విరి విగా పాశ్చాత్య, తెలుగు సాహిత్యాన్ని చదువుకున్నారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా ఉద్యమకారుడిగా పనిచేశారు. తన స్నేహితులతో కలి సి ఎన్నో ఉద్యమాల్లో భాగస్వామి అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఒకసారి అరెస్టు నల్లగొండలో జైలుజీవితం గడపాల్సి వచ్చింది. జైలు లో ఉన్న సమయంలోనే ఆయన తెలంగాణ మాండలికంలో కవితలు రాయడం మొదలుపెట్టారు. అవే కవితలను తర్వాతికాలంలో ‘ఊరోళ్ల్లు’ పేరుతో సంకలనంగా వెలువరించారు.

నాటి తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఆయన రచనలపై గాఢమైన ప్రభావాన్ని చూపింది. భానుమూర్తి సాహిత్య రంగం నుం చి జర్నలిజం వైపు  అడుగులు వేశారు. ‘ఉదయం’ దినపత్రికలో ఆయన రాజకీయ వ్యంగ్య రచనలకు శ్రీకారం చుట్టారు. అప్పటి రాజకీయ పరిస్థితులను, పాలనా విధానాలను తనదైన శైలిలో విశ్లేషించారు. వందలాది వ్యాసాలు రాశారు. ఎన్టీఆర్, చంద్రబా బు ప్రభుత్వాల పనితీరుపై ఆయన సంధించిన వ్యంగ్య బాణాలు పాఠకులను ఆకట్టుకునేవి. ఆ వ్యంగ్య రచనలన్నీ ‘పలుకుబడి’ పేరుతో తర్వా త పుస్తక రూపంలో వచ్చాయి. 

‘చల్నేదో బాల్‌కిషన్’కు విశేష ఆదరణ

‘ఉదయం’ పత్రికలో ‘చల్నేదో బాల్ కిషన్’ శీర్షికతో ఆయన రాసిన హాస్య రచనలు విశేష ప్రజాదరణ పొందాయి. ఆ రచనలు విశాలాంధ్ర ప్రచురణాలయం ద్వారా పుస్తకంగా వెలువడ్డాయి. భానువర్తి రాసిన కథలు, నవలలు సాహితీ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఆయన ‘ఆక్సిజన్ బార్’, ‘నెమిలీక’, ‘గులేర్’ వంటి కథా సంపుటాలను పాఠకులు అందించారు. ‘గిల్లిదండ’ పేరుతో ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో వచ్చిన హాస్య రచనలను సంకలనంగా ప్రచురించారు.

అలాగే ‘లత్కోర్ సాబ్’ అనే నవల కూడా పాఠకుల ఆదరణ పొందింది. ‘ఎంత బాగుండు’, ‘ఎన్‌కౌంటర్’, ‘చాటింపు’, ‘తలాక్’, ‘నిండా మునిగిండ్రు’, ‘మంత్రి కుర్చీ’ వంటి కథలు తెలంగాణ మాండలికంలో వచ్చాయి. భానుమూర్తి కేవలం ఒక రచయితగానే కాకుం డా అందరికీ ఆత్మీయుడయ్యారు.

తెలంగాణ మాండలికానికి అక్షర రూపం ఇచ్చి, దానిని సాహిత్యంలో సగర్వంగా నిలబెట్టిన సాహితీ దిగ్గజం తెలిదేవర భానుమూర్తి. తెలంగాణ నుడికారాన్ని, జాతీయాలను, సొంతమైన పలుకుబడులను ఒడిసిపట్టి, వాటిని పాఠకులకు అందించడంలో ఆయన శకపురుషుడిగా నిలిచారు.