30 April, 2026 | 3:35 AM

10న మోదీ జనాగ్రహ సభ

30-04-2026 02:09 AM

కాంగ్రెస్ విభజన రాజకీయాలపై జనం ఆగ్రహం

జనాగ్రహ సభ పోస్టర్‌ను ఆవిష్కరించిన బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ‘జనాగ్రహ’ సభను నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచం దర్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ భారత్‌జోడో అంటూ చేపట్టిన యాత్ర, దేశాన్ని విభజించే రాజకీయంగా తోడో యాత్రగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చర్యలు దేశాన్ని విభజించేలా ఉన్నాయని ప్రజలు గమనిస్తున్నారని, అందుకే తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబించేలా ఈ సభకు జనాగ్రహ సభ అని నామకరణం చేశామన్నారు.

బుధవారం పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, రఘునందన్ రావు, అరవింద్, బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం రాంచందర్ రావు మీడియా సమావేశంలో జనాగ్రహ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రధాని పర్యటన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో దాదాపు రూ. 7,700 కోట్ల నుంచి రూ. 8,000 కోట్ల వరకు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని పేర్కొన్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని తెలిపారు.

బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ ప్రయోజనాలకే పరిమితమైందని అన్నారు. అవకాశవాద రాజకీయాలు తెలంగాణలో పనిచేయవన్నారు. కాంగ్రెస్ అన్నివర్గాలను మోసం చేసిందని, మహిళా బిల్లును కూడా వ్యతిరేకించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకువచ్చేలా ప్రజలు ఆశీర్వదించాలని  కోరారు.

మే 10న మోదీ సభను విజయవంతం చేసేలా రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ముఖ్యనాయకులకు జనసమీకరణ బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. రెండు నుంచి మూడు లక్షల మంది సభకు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.