30 April, 2026 | 3:38 AM

ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి.. డేంజర్ బెల్స్!

30-04-2026 02:26 AM

రాష్ట్ర సర్కార్‌కు సవాల్

  1. రుతుపవనాలు ఆలస్యమైతే మరింత కష్టం 
  2. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం
  3. కాళేశ్వరం మరమ్మతుల్లో జాప్యంతో పరిస్థితి మరింత తీవ్రతరం
  4.   2016 నాటి కరువు ఎదురయ్యే ప్రమాదం


హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి) : రాష్ట్రంలో సాగు, తాగు నీటి సంక్షోభం మళ్లీ తలెత్తే సంకేతాలు స్ప ష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాన జలాశయాలు క్రమంగా డెడ్ స్టోరేజ్ దిశగా పడిపోతుండటం పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తోంది. ఒకప్పుడు సాగు, తాగునీటి అవసరాలను సమృద్ధిగా తీర్చిన ప్రాజెక్టులు ఇప్పుడు కనిష్ట స్థాయిల వద్ద నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాజెక్టుల్లోని ప్రస్తుత నీటి మట్టాలను గమనిస్తే 2016లో ఎదు రైన తీవ్ర కరువు పరిస్థితులు మరోసారి పునరావృతమవుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రాజె క్టు నీటి నిల్వల గణాంకాలు అధికార వర్గాల్లోనే కాకుండా సాధారణ ప్రజలను కలవరపెడుతున్నాయి. దీంతో ఇక రుతుపవనాల కోసం ఎదురుచూపులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కానీ ఆ వర్షాలు వచ్చేవరకు ప్రస్తుత నిల్వలు సరిపోతాయా అన్న అనుమానం వ్యక్తమవుతుంది. వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ నీటి వినియోగం కూడా అధికమవుతుండటం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది.

ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోవడంతో తాగునీటి సరఫరా, సాగునీటి పంపిణీపై ఒత్తిడి పెరుగుతోంది. పెద్ద ప్రాజెక్టులే సేఫ్ జోన్‌లో లేని పరిస్థితిలో.. చిన్న జలాశయాల పరిస్థితి ఇంకా దయనీయంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలాశయాల్లో నిల్వలు తగ్గిపోవడం ద్వారా వ్యవసాయం నుంచి పట్టణ నీటి సరఫరా వరకు అన్ని రంగాలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింత పెరుగుతుంది. చివరకు ఈ సంక్షోభం తీవ్రతను నిర్ణయించేది రుతుపవనాలేనని, అప్పటివరకు ప్రతి చుక్క నీరు విలువైనదిగా మారే దశకు రాష్ట్రం చేరుకుంటోందనే భావన బలపడుతోంది. దీంతో అటు సాగు, ఇటు తాగునీటి అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. 

గుర్తుచేస్తున్న గత అనుభవాలు..

రాష్ట్రంలోని పలు ప్రధాన జలాశయాలు ప్రస్తుతం ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. నిల్వలువేగంగా తగ్గిపోవడంతో కొన్ని ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్‌కు దగ్గరగా ఉండగా, మరికొన్ని కనిష్ట వినియోగ స్థాయిలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణా బేసిన్‌లో జూరాల ప్రాజెక్టు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. పూర్తి సామర్థ్యంతో పోలిస్తే చాలా తక్కువ నీరు మాత్రమే మిగిలి ఉండటం వల్ల సాగునీటి విడుదలపై ఇప్పటికే ప్రభావం పడుతోంది. తుంగభద్రలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో భవిష్యత్ అవసరా లను తీర్చడం కష్టంగా మారే అవకాశముంది. పెద్ద ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఇంకా కొంత నిల్వ ఉన్నప్పటికీ, అవి కూడా తగినంత స్థాయిలో లేవని అధికారులు భావిస్తున్నారు. గోదావరి బేసిన్‌లో పరిస్థితి ఆందో ళనకరంగా ఉంది. నిజాంసాగర్, కడెం వంటి ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్‌కు చాలా దగ్గరగా ఉన్నాయి. మిడ్ మానేర్, లోయర్ మానేర్ జలాశయాలు కూడా తక్కువ నిల్వలతో కొనసాగుతున్నాయి.

ఇవి ముఖ్యంగా స్థానిక నీటి అవసరాలకు కీలకమైన ప్రాజెక్టులు కావడంతో ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ గా కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం జలాశయాల్లో కనిపిస్తున్న నీటి కొరత పరిస్థితులు గతంలో ఎదురైన సంక్షోభాలను గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా 2016లో నమోదైన తీవ్ర కరువు సమయంలో రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులు దాదాపు డెడ్‌స్టోరేజ్ స్థాయికి చేరా యి. అప్పట్లో సాగునీటి విడుదలలు పూర్తిగా నిలిపివేయాల్సి రావడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు.

తాగునీటి కోసం పట్టణాలు, గ్రామాలు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా 2003-04 కాలంలో కూడా వరుసగా వర్షా లు తగ్గిపోవడంతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు ఖాళీ అయ్యాయి. నీటి కొరత కారణంగా వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్ ఉత్పత్తి తగ్గి పవర్ కట్స్ కూడా పెరిగాయి. ఆ సమయంలో నీటి వినియోగంపై కఠిన నియంత్ర ణలు అమలు చేయాల్సి వచ్చింది. 2019లో నూ రుతుపవనాల ముందువరకు పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి కీలక ప్రాజెక్టుల్లో నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకోవడంతో రాష్ట్రం సంక్షోభ అంచులపైకి వెళ్లింది. అయితే ఆ సంవత్సరం మంచి వర్షాలు రావడంతో పరిస్థితి త్వరగా మారిపోయింది. వర్షాలపై అధిక ఆధారపడే పరిస్థితుల్లో నిల్వలు తగ్గిపోతే నీటి సంక్షోభం తప్పదని గత అనుభవాలు స్పష్టంచేస్తున్నా యి. ప్రస్తుతం కూడా అలాంటి సంకేతాలే కనిపిస్తుండటంతో ముందస్తు చర్యలు తీసుకో వాలనే అవసరం ఉన్నది. 

కీలకంగా ఎల్ నినో ప్రభావం.. 

జలాశయాల్లో నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో సమయానికి, సాధారణ స్థాయిలో వర్షాలు పడితేనే పరిస్థితి కొంతమేర మెరుగుపడే అవకాశం ఉంది. అయితే వర్షాలు ఆల స్యమైతే లేదా తక్కువగా కురిసినా, ఇప్పటికే క్రిటికల్ స్థాయిలో ఉన్న ప్రాజెక్టులు మరింత ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావం కీలకంగా మారుతుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మాన్‌సూన్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 

ప్రభుత్వానికి సవాల్‌గా..

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అటు కృష్ణా బేసిన్‌లో, ఇటు గోదావరి బేసిన్‌లోని జలాశయాల్లో నిల్వలు తగ్గిపోతున్న పరిస్థితిలో రాబోయే రెండు, మూడు నెలలు కీలకంగా మారుతున్నాయి. నీటి లభ్యత క్రమంగా తగ్గిపోతుండటంతో పలు రంగాల్లో ఒత్తిడి పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మొ దటిగా తాగునీటి సరఫరానే ప్రధాన సవాలుగా మారే సూచనలు ఉన్నాయి. పట్టణా లు, నగరాల్లో నీటి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుండగా, నిల్వలు తగ్గిపోవడం సరఫరాపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

అవసరమైతే వాటర్ రేషనింగ్ లేదా ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడాల్సిన పరి స్థితి రావచ్చు. వ్యవసాయ రంగం కూడా గట్టిగా దెబ్బతినే అవకాశం ఉంది. కాలువల ద్వారా నీటి విడుదల తగ్గించడం లేదా పూర్తిగా నిలిపివేయడం జరిగితే రైతులు పంటలను కొనసాగించడం కష్టమవుతుం ది. ముఖ్యంగా రెండో పంటపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు.

భూగర్భజలాలపై ఒత్తిడి పెరిగి బోర్లు ఎండిపోవడం కూడా మరో సమస్యగా మారుతుంది. విద్యుత్ రం గంలో కూడా ప్రభావం తప్పదు. హైడల్ పవర్ ఉత్పత్తి తగ్గిపోతే విద్యుత్ సరఫరాపై అదనపు భారం పడుతుంది. దీనివల్ల ఇతర వనరులపై ఆధారపడాల్సి వస్తుంది. పరిశ్రమలు, ముఖ్యంగా నీటివినియోగంపై ఆధా రపడే యూనిట్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 

కాళేశ్వరం జాప్యంతో.. 

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జలాశయాల్లో నిల్వలు తగ్గిపోతుండటంతో తాజా కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు చేసే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజె క్ట్ మరమ్మతులు ఇంకా పూర్తికాకపోవడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రానికి లైఫ్‌లైన్‌గా భావించే ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పనిచేయకపోతే నీటి నిర్వహణపై మరింత ఒత్తిడి పడే ప్రమాదం ఉంది. కాళేశ్వరం ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోసి వివిధ రిజర్వాయర్లకు తరలించే వ్యవస్థ కీలకం.

అయితే ఇటీవల తలెత్తిన సాంకేతిక సమస్యలు, మరమ్మతుల ఆలస్యం కారణంగా ప్రాజెక్ట్ పూర్తిసామర్థ్యంతో పనిచే యడం లేదు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని కుంగిపోయిన బరాజ్‌పిల్లర్లను మర మ్మతు చేయడంలో జాప్యం జరుగుతుండటం గమనార్హం. ఈ పరిస్థితి కొనసాగితే, ఇప్పటికే తగ్గిపోయిన జలాశయాల నిల్వలను భర్తీచేసే అవకాశాలు మరింత తగ్గిపో తాయి.

ప్రస్తుతం వేసవితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు సమయానికి అందుబాటులో లేకపోవడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారుతోంది. తాగునీరు, సాగునీటి అవసరాలను సమన్వయం చేయడం కష్టంగా మారే సూచ నలు కనిపిస్తున్నాయి. దీంతో ఒకవైపు జలాశయాల్లో తగ్గుతున్న నిల్వలు, మరోవైపు కాళేశ్వరం మరమ్మతుల ఆలస్యం కారణంగా రాష్ట్రంలో నీటి సంక్షోభంపై ప్రభు త్వానికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.