నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ధాన్యం కొనుగోళ్ల పరిశీలన నిర్వాహకులపై వేటు
మహబూబాబాద్, మే 19 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారులు విస్తృతంగా పర్యటించి కొనుగోళ్లలో వేగం పెంచాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. మంగళవారం నరసింహులపేట, చిన్నగూడూరు మండలాలలో విస్తృతంగా పర్యటించి మక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్వయంగా తనిఖీ చేశారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న కొనుగోలు కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తూ రికార్డులను సరిగా రాయడం లేదని, ఇప్పటివరకు వచ్చిన ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యం నాణ్యత ప్రమాణాలు, గన్ని సంచుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిఓ, అగ్రికల్చర్ అధికారులపై కఠిన చర్యలు తీసుకొని, బాధ్యతల నుంచి తప్పించాలని సంబంధిత అధి కారులను ఆదేశించారు.
జిల్లావ్యాప్తంగా అన్ని మక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణ రవా ణా తదితర అంశాలలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుం టామని ఇప్పటికే హెచ్చరించడం జరిగిందని, అయినా కొన్నిచోట్ల నిర్లక్ష్యంగా ఉన్నా రని అట్టి వారిని గుర్తించి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాన్యం తేమ వచ్చిన తర్వాతనే కూపన్ల ద్వారా కేటాయించాలని సూచించారు. రవాణా చేయు సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు రాకుం డా ముందస్తు చర్యలు తీసుకొని వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని, హమాలీల ను అధికంగా అందుబాటులో ఉంచుకోవాలని లోడింగ్, అన్లోడింగ్ విషయంలో వేగం గా ముందుకు సాగాలని సూచించారు. ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై అధికారి రమేష్, మేనేజర్ నరసింహారావు, స్థానిక ఎంపీడీవో ఎమ్మార్వో తదితరులు ఉన్నారు.
భూపాలపల్లిలో..
ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రైస్ మిల్లులను సీజ్ చేయడంతో పాటు పోలీస్ కేసులు నమోదు చేస్తామని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్లతో కలిసి గణపురంలోని జానకిరామ్ రైస్ మిల్, చిట్యాల మండలం కైలాపూర్లోని లక్ష్మీనరసింహ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం దిగుమతి జరుగుతున్నప్పటికీ రైతులకు ట్రక్ షీట్లు ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంటా పూర్తయ్యిన వెంటనే రైతులకు ట్రక్ షీట్లు ఇవ్వాలని, ఆలస్యం ఎందుకు జరుగుతోందని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ట్రక్ షీట్లు ఇవ్వకుండా ధాన్యాన్ని మిల్లులకు తరలించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలులో రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం చేసే విధంగా వ్యవహరించ కూడదని, ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడితే ఎవరినీ వదిలిపెట్టమని, మిల్లులను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తే పూర్తి సహకారం ఉంటుందని, అక్రమాలను సహించబోమని తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా జరుగుతున్న దోపిడీ పద్ధతులు ఇకపై కొనసాగకుండా తక్షణమే సరిచేసుకోవాలని సూచించారు.
అన్ని కొనుగోలు కేంద్రాలలో రైతులకు ట్రక్ షీట్లు ఇవ్వడం తప్పనిసరి చేయాలని, దీనిపై జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. జిల్లాలో 90 శాతం మక్కలు కొనుగోలు పూర్తి అయ్యిందని, చిట్యాల మండలం తిరుమలాపూర్ లో మక్కలు రవాణా చేసేందుకు వెంటనే వాహనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వర్షాలు వస్తే రైతులు ఇబ్బందులు పడతారని కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ క్షేత్రస్థాయి తనిఖీల్లో కాంటా పూర్తికాగానే రైతులకు ట్రక్ షీట్లు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పటికీ అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్, డీఎం రాములు, సహకార అధికారి వాలియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.






