డ్రగ్ ఫ్రీ ఇండియా కోసం దేశభక్తి ఫ్లాగ్ మార్చ్
విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్‌ఐ మైబెల్లి
ఉప్పల్,(విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎస్ఎస్ఎస్ యువసేన ఆధ్వర్యంలో “డ్రగ్ ఫ్రీ ఇండియా” లక్ష్యంగా దేశభక్తి ఫ్లాగ్ మార్చ్‌ను రాఘవేంద్ర నగర్‌లోని కమలా మెమోరియల్ హై స్కూల్ (కేఎంహెచ్‌ఎస్)లో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మైబెల్లి పాల్గొని విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఫ్లాగ్ మార్చ్‌లో కేఎంహెచ్‌ఎస్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని “సే నో టు డ్రగ్స్”, “డ్రగ్ ఫ్రీ ఇండియా” వంటి నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. అనంతరం నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా భద్రత తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటంతో పాటు డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తంగా ఉండాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఎస్‌ఐ మైబెల్లి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, యువసేన సభ్యులు పాల్గొన్నారు.






