15 May, 2026 | 2:51 AM

ఇంకెప్పుడు కొంటరు?

15-05-2026 12:11 AM
  1. ధాన్యం కొనుగోళ్లజాప్యంపై రైతుల ఆగ్రహం
  2. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళనలు
  3. మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు

మహబూబాబాద్/నిర్మల్, మే 14 (విజయక్రాంతి)/హుస్నాబాద్/సుల్తానాబాద్, మే 14: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల ఐకెపి ధాన్యం కొను గోలు కేంద్రం వద్ద రైతుల సహనం నశించిపోవడంతో రోడ్డెక్కారు. నెల రోజుల క్రితమే కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం పోసినా ఇప్పటికీ కాంటాలు వేయకపోవడంతో గురువారం రైతులు సిద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పంట కోయడమే కాదు ప్రభుత్వాన్ని వేడుకోవడమూ రైతు పనైపోయిందా..? అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలు కూడా లేవని, ప్యాడి క్లీనింగ్ మిషన్లకు విద్యుత్ సౌకర్యం లేక పనులు నిలిచిపోతున్నాయని రైతులు ఆరోపించారు. ఇదే అదనుగా కొందరు మధ్యవర్తులు తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతుల కష్టాన్ని దోచుకుంటు న్నారని ఆరోపించారు. రైతుల రాస్తారోకోతో సిద్దిపేట  హనుమకొండ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు.

సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వ డంతో రైతులు ఆందోళన విరమించారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మమతా రైస్ మిల్లు వారు వరి ధాన్యం దింపుకోవడం లేదంటూ ఎలిగేడు మండ లం రావులపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ట్రాక్టర్‌ను రాజీవ్ రహదారిపై పెట్టి  బైటాయించారు. వరి ధాన్యం దింపుకునేనంతవరకు కదిలేది లేదంటూ మండు టెండలో భీష్మించుకుని కూర్చున్నారు.

ఈ విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ ఎస్సు చంద్రకుమార్, సివిల్ సప్లు డిటి మహేష్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. దీంతో అధికారులు రైస్ మిల్లు యజమానులతో మాట్లాడి దింపుకునే విధంగా చర్యలు చేపట్టారు. రైస్ మిల్లు యజమానులు దింపుకుంటామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.

ప్రభుత్వం అన్నదాతను ఆగం పట్టిస్తోంది

రైతులు పండించిన ప్రతి దాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రగల్బాలు పలికి, తీరా రైతులు ప్రభుత్వ మాటలను నమ్మి కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని కొనకుండా గాలికి వదిలేసి అన్నదాతను ప్రభుత్వం ఆగం పట్టిస్తోందని మాజీమంత్రి డీ ఎస్ రెడ్యానాయక్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మన్నెగూ డెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి రోజుల తరబడి నిరీక్షిస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆరోపించారు.

అకాల వర్షాలకు ధాన్యం తడిసి పోయి మొలకెత్తుతోందని, అయినా రైతుల పట్ల కనికరం చూపడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఆర్థి కంగా నష్టపోతున్నారని ఆరోపిస్తూ, వెంటనే కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వెంటనే అధికారులు స్పందించి, కొనుగోలు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు జయపాల్ రెడ్డి, బిక్షం రెడ్డి, రాయల వెంకటేశ్వరరావు, రడం బాబు, ప్రశాంత్, విద్యాసాగర్ పాల్గొన్నారు.

ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

నిర్మల్ జిల్లా కేంద్రంలో పంట కొనుగోళ్లపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు మహాధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై మండుటెండలో గంటసేపు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు కన్నీళ్లు పెట్టుకుంటే చూడలేమని ప్రకటించిన ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో రైతులు పంట కొనుగోల కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ అధికా రుల కాలు మొక్కుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరిగిన ప్రభు త్వం కొనుగోలు చేపట్టకపోగా లారీలు, కూలీలు, గోనే సంచుల కొరత పట్టించుకోవడంలేదన్నారు. 

రైతులే స్వయంగా కూలీలుగా మారుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోని కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నారు. అంతకుముందు లక్ష్మణ మండలం రాజాపూర్ గ్రామంలో రైతులు చేసిన ధర్నాలో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.