1 September, 2026 | 4:26 AM

మార్పులో మతలబేమిటి..?

01-09-2026 12:02 AM
  1. ఏడాదికొకసారి ‘పీ ఎం ఈ ’
  2. సింగరేణి లో లేబర్ కోడ్ 
  3. పీ ఎం ఈ కాలాన్ని కుదిస్తూ సర్క్యులర్
  4. మౌనంగా కార్మిక సంఘాలు
  5. లేబర్ కోడ్ ఆగింది ఎక్కడా?

బెల్లంపల్లి, ఆగస్టు 31: సింగరేణిలో లేబర్ కోడ్ కూసింది. లేబర్ కోడ్ ను రద్దు కోసం కార్మిక సంఘాలన్నీ పోరాటం చేశాయి. అన్నివర్గాల శ్రామికులు లేబర్ కోడ్ కు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మె జరిగిన విషయం విదితమే. సింగరేణిలో కార్మిక సంఘాలు లేబర్ కోడ్ 23 డిమాండ్ల ను నిలిపివేయాలని సింగరేణిలో గుర్తింపు సంఘం ఎఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ ప్రతినిధులు (Representatives of AITUC, the representative union, and INTUC) ప్రత్యేక చొరవ తీసుకున్నారని ప్రచారం.

లేబర్ కోడ్ నిలిపివేత పై అంగీకారం సాధించినట్టు చెప్పుకొన్నారు. ఈ విషయాన్నీ ఆ సంఘాల నాయకులు నేరుగా ప్రకటించుకున్నారు. లేబర్ కోడ్ సింగరేణిలో అమలు చేయరని అందరూ అనుకున్నారు. అందుకు భిన్నంగా కంపెనీ చర్యలు చేపట్టిందనీ తేలిపోయింది. సింగరేణిలో లేబర్ కోడ్ ఆగలేదని తాజాగా ఓ సర్క్యూ లర్ అందుకు సాక్షీభూతంగా నిలిచింది.. ఈ సర్క్యులర్ సింగరేణిలో ప్రకంపనలు రేపుతుంది.

సర్క్యులర్ పై జోరుగా చర్చ జరుగుతోంది. సింగరేణిలో కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి సింగరేణి యాజమాన్యం వైద్య పరీక్షలు చేయిస్తారు. ఇది సింగరేణిలో ఆనవాయితీ. కాగా పిరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ (పీ ఎం ఈ ) పరీక్షలు చేసుకునే కార్మికులకు కంపెనీ మస్టర్ కూడా ఇస్తున్నది. 

ఏడాదికొకసారి వైద్య పరీక్షలు..

ఈ ప్రక్రియ ను రెండు క్యాటగిరీయాలుగా విభజించారు. వయస్సు ప్రతిపాదికగా పీ ఎం ఈ నీ నిర్వహిస్తున్నారు. 30 ఏళ్ళ వరకు ఉన్న ఐదు సంవత్సరాలు, 40కి పై బడిన కార్మికులకు 30 నెలలు అనగా రెండున్నర ఏండ్ల కొకసారి పీ ఎం ఈ నిర్ణయించారు.

తాజాగా ఆకస్మికంగా 12 నెలల వ్యవది చేశారు. పీఎంఈ పీరియడ్ ను కుదిస్తూ కంపెనీ సర్క్యూలర్ జారీచేసింది. వన్ ఇయర్ కు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని యాజమాన్యం మరోకొత్త నిర్ణయాన్నీ ప్రకటించడం సింగరేణిలో కలకలకం రేపుతున్నది. యాజమాన్యం జారీచేసిన ఈ ఉత్తర్వులు పైకి మంచిగానే కనిపిస్తున్నాయి. కానీ అందులో ఏ మర్మం దాగి ఉందని కార్మికులు మాత్రం ఆందోళన పడుతున్నారు.

తరచుగా పీఎం ఈ ల వ్యవధి మార్పుల పరంపర ఉద్యోగ భద్రత కు ఎక్కడా విఘాతం కలిగిస్తుందోనన్న భయం మాత్రం కార్మికుల్లో వ్యక్తం అవుతున్నది. పీ ఎం ఈ పేరిట సింగరేణిలో కార్మికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సర్క్యులర్ పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో కార్మికులకు అనేక అనుభవాలు ఉన్నాయి.

పీ ఎం ఈ పరీక్షలో తీవ్రమైన జబ్బులన్నాయని తేలిన కార్మికులను అధికారులు రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన దాఖలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. పీ ఎం ఈ పీరియడ్ ను తగ్గించాలని ఏ కార్మిక సంఘం కోరలేదు. కార్మికులు కూడా ఏనాడు ఆశించనూలేదు. అలాంటిది కార్మికుల సంక్షేమ కోసం స్వతాహ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉద్యోగస్తుల సంఖ్యను ను తగ్గించాలనే ఉద్దేశంతోనే పీ ఎం ఈ పీరియడ్ ను తగ్గించారని విశ్లేషకులు అంటున్నారు. పీ ఎం ఈ వైద్య పరీక్షలలో అనారోగ్యం కార్మికులు, ఉద్యోగాల్లో పనిచేయని పరిస్థితి ఉంటే, వారి స్థానంలో కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇవ్వడం ఉంటుంది. ఇలా సవ్యంగా ఈ ప్రక్రియ జరిగితే ఎవకీ అభ్యంతరం ఉండదు. కానీ అంత న్యాయ బద్ధంగా సింగరేణి యాజమాన్యం వ్యవహరిస్తుందా?

అనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న తలెత్తుతున్నది. ఆఘమేఘాల మీద కంపెనీ పీ ఎం ఈ కాలపరిమితిని తగ్గించడంలోనే బలమైనా కారణం లేకపోలేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పీ ఎం ఈ విషయంలో కార్మికుల్లో అనవసర భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ భయాలను నివృత్తి చేయాల్సిన కార్మిక సంఘాలు మాత్రం నోరు మెదపకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పీ ఎం ఈ సర్క్యులర్ వెనుక పెద్ద కుట్రనే దాగి ఉందని వాదనలకు ఆస్కారం ఏర్పడింది. ఏదేమైనా పీ ఎం ఈ వైద్య పరీక్షలు కార్మికుల ఉద్యోగాలకు పెద్ద పరీక్షగా మారనున్నదనడంలో సందేహంలేదు. సింగరేణిలో పీ ఎం ఈ ఉత్తర్వుల నేపథ్యంలో లేబర్ కోడ్ అమ్ముల పొదిలో మరెన్ని సర్కులర్లు ఉన్నాయో ? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆధునిక వైద్య సేవల సంగతేంటి?

కార్మికుల సంక్షేమం కోసమే పీ ఎం ఈ ఉద్దేశమని కంపెనీ చెబుతున్నది. వైద్య సేవలను అభివృద్ధిని విస్మరించారన్న విమర్శలు ఉన్నాయి. సింగరేణిలో నెలకొల్పిన సింగరేణి ఆస్పత్రుల్లో వైద్య సేవలు ‘గొర్రె తోక బెత్తెడు చందంగా‘ ఉన్నాయి. వైద్య సేవల పై సింగరేణి కంపెనీకి కార్మికుల ఆరోగ్యం పై చిత్తశుద్ధి లేదన్న విమర్శలు ఉన్నాయి. సింగరేణి ఆస్పత్రిలో వైద్య నిపుణులు లేరు.

ఆధునిక వైద్య పరికరాలు మచ్చుకు కనిపించవు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు కావాలని కార్మికులు చిరకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల ఆశలను కంపెనీ తీర్చిన దాఖలా లు లేవు. ఇక్కడే సింగరేణి కార్మికుల సంక్షేమం యాజమాన్యం డొల్లతనం బయట పడింది. సింగరేణి సేవలు ‘నేతి బీరలో నెయ్యి ‘చందంగా ఉన్నాయని విమర్శలు ఉన్నాయి.

సంక్షేమాన్ని అటుంచి సింగరేణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యలను మాత్రం శరవేగంగా అమలు చేస్తున్నదని మండి పడుతున్నారు. అందులో భాగంగానే సింగరేణిలో లేబర్ కోడ్ ను చూడాలని పరిశీలకులు అంటున్నారు.

ఇప్పటి నుంచి సింగరేణి కార్మికుల మెడకు లేబర్ కోడ్ కత్తి వేలాడుతూనే ఉంటుందినీ పరిశీలకులు అంటున్నారు. కాలక్రమేణా లేబర్ కోడ్ మాటున సింగరేణి కార్మికులకు అష్టకష్టాలు తప్పవన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. సింగరేణి యాజమాన్యం చేతిలో లేబర్ కోడ్ ఒక బ్రహ్మాస్త్రమని తస్మాత్ జాగ్రత్త అని కార్మికులను విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.