సీబీసీఐడీ విచారణ కంటే ఉత్తమమైంది ఏముంది?
- బీఆర్‌ఎస్ హయాంలోని మూడు కమిటీల రిపోర్టు ఏందుకు బయటపెట్టలేదు
సభను అడ్డుకోవడమే వారి ఎజెండా: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): మైనింగ్‌పై సీబీసీఐడీ కంటే రాష్ట్రస్థాయిలో అత్యున్నతమైన విచారణ ఇంకా ఏముంటుందని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వేసిన ౩ హౌస్ కమిటీల రిపోర్టులను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ఆదివారం అసెంబ్లీ లో ఆయన మాట్లాడుతూ.. హౌస్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సెల్ ఆక్యుపేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్, హౌస్ కమిటీ ఆన్ ఎంక్వైరీ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్, హౌస్ కమిటీ ఆన్ ఇరెగ్యులారిటీస్ ఇన్ హౌజింగ్ కోటూ సొసైటీస్‌లను వేశారని, కానీ, ఎప్పు డూ సమావేశాలు సక్రమంగా జరగలేదని, నివేదికలు ఇచ్చిందీ లేదన్నారు.
హౌస్ కమిటీ కూడా సీబీసీఐడీతో విచారణ చేయించాలనే సిఫార్సు చేస్తుందని, ఆ విషయం బీఆర్‌ఎస్ సభ్యులకు కూడా తెలుసన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో సీబీసీఐడీతో విచారణ చేయిస్తామని ప్రకటించారని, అయినా ఎందుకు హౌస్ కమిటీ కోసం పట్టుపడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఎవరిపైనో కక్ష్య సాధించాలనే ఉద్దేశంతో సీబీసీఐడీ విచారణకు నిర్ణయం తీసుకోలేదని, పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ అక్రమాలను వెలికి తీసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ విషయం బీజేపీ సభ్యులు కూడా గమనించాలన్నారు.
ఒకవేళ మీ దగ్గర ఉన్న ఆధారాలను విచారణ సమయంలో సీబీసీఐడీ అధికారులకు అందజేయాలని బీఆర్‌ఎస్ సభ్యులకు సూచించారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే బీఆర్‌ఎస్ సభ్యుల అజెండాగా కనిపిస్తోందన్నారు. 2014 నుంచి జరిగిన మైనింగ్ అక్రమాలపై విచారణ చేయించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీబీసీఐడీపై నమ్మకం లేకపోతే తామేం చేయాలన్నారు. ముఖ్యమైన బిల్లులపై చర్చ జరిగే సమయంలో సభను అడ్డుకుంటున్న బీఆర్‌ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఏమైందని బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి కౌంటరిచ్చారు.




