కరువు కోరల నుంచి కోటీశ్వరులు
- దేశానికే ఆదర్శం మహారాష్ట్రలోని హివారే బజార్
- శ్రమయోధులు గ్రామస్తులు.. సాగులో నూతన విధానాల అమలు
- సామూహిక శక్తిగా పనిచేసి.. ధనవంతులై
- పోపట్‌రావ్ బాగుజీ పవార్ దార్శనికతతో సంపన్న గ్రామంగా ఎదుగుదల
హైదరాబాద్, జూలై ౭ (విజయక్రాంతి): ఒకప్పుడు ఆ గ్రామం తీవ్ర క్షామాన్ని చవిచూసింది. కరవు కోరల్లో చిక్కుకుని అల్లాడింది. కడు పేదరికం అనుభవించింది. బతుకుదెరువు లేక గ్రామస్తులకు నగరాలకు వలసలు వెళ్లారు. నిరాశకు నిలువెత్తు రూపంగా నిలిచిన ఆ కుగ్రామం పేరు మహారాష్ట్రలోని హివారే బజార్. సామూహికంగా పనిచేసి గ్రామస్తులు చివరకు దారిద్య్రం నుంచి విముక్తి పొందారు. ఇప్పుడా గ్రామం కోటీశ్వరుల గ్రామంగా ఎదిగింది.
ప్రస్తుతం ఆ పల్లె దేశంలోనే అత్యంత ధనవంతుల గ్రామాల్లో ఒకటి. అహ్మద్‌నగర్ నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉందీ కుగ్రామం. గ్రామంలోని కుటుంబాలు 235. జనాభా 1,250. దేశంలోనే అత్యంత కరువు ప్రాంతమిది. గ్రామ సగటు వార్షిక వర్షపాతం కేవలం 400 మి.మీ మాత్రమే. 1970ల ప్రాంతంలో వచ్చిన వర్షాభావ పరిస్థితుల్లో అక్కడి భూములు బంజరు భూములుగా మారిపోయాయి. బావులు ఎండిపోయాయి. పశుగ్రాసం కరువైంది. దీంతో గ్రామస్తులు బతుకుదెరువు లేని గ్రామస్థులు అడవులను నరికేశారు. కట్టెల కోసం, నాటుసారా తయారీ కోసం అడవిని ధ్వంసం చేశారు. గ్రామంలో అక్రమంగా 22 మద్యం దుకాణాలు తెరిచారు. దీనివల్ల నేరాలు పెరిగిపోయాయి. ప్రభుత్వ అధికారులు ఇక్కడికి బదిలీ కావడాన్ని ఒక శిక్షగా భావించేవారు.
ఒక్కడు తలరాత మార్చాడు
అలాంటి గ్రామ చరిత్ర 1989లో మారిపోయింది. తీవ్రమైన కరువు సమయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్, మాజీ క్రికెటర్ పోపట్‌రావ్ బాగుజీ పవార్ ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. అన్నా హజారే స్ఫూర్తితో ఆయన గ్రామాభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. తొలుత నీటి సంరక్షణే ధ్యేయంగా సమగ్ర పునరుద్ధరణ అమలు చేశాడు. మద్యం దుకాణాలను మూసివేయించాడు. తర్వాత ఉపాధి హామీ పథకం, ఆదర్శ్ గావ్ యోజన నిధులను సద్వినియోగం చేశాడు.
1,000 హెక్టార్ల భూమిని సారవంతంగా మార్చాడు. కొండ వాలుల్లో 52 మట్టి కట్టలు (ఎర్తెన్ బండ్స్), 32 రాతి కట్టలు నిర్మించాడు. తొమ్మిది చెక్ డ్యాంలు, ఊట చెరువులు ఏర్పాటు చేశాడు. 40,000 కందకాలను తవ్వారు. సామూహిక వన పెంపకం చేపట్టాడు. పశువుల బహిరంగ మేతపై నిషేధం విధించాడు. దీనివల్ల 70 హెక్టార్లలో అడవులను పునరుజ్జీవింపజేశాడు. వ్యవసాయంలో బిందు సేద్యాన్ని ప్రవేశపెట్టాడు.
రైతులను ఎక్కువ నీరు అవసరమయ్యే చెరకు, అరటి వంటి పంటలను పక్కన పెట్టించి, వర్షాధార పంటలైన ఉల్లి, టమాటా, పూలు, చిరుధాన్యాల సాగు ప్రోత్సహించాడు. దీంతో రైతులంతా గణనీయమైన లాభాలను ఆర్జించారు. సారవంతమైన భూమి విస్తరణ కూడా పెరిగింది. క్రమంగా గ్రామంలో డజన్ల కొద్దీ రైతులు లక్షాధికారులయ్యారు. పేదరికం తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం ఆగ్రామంలో కేవలం మూడు కుటుంబాలు మాత్రమే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయి.
గ్రామ అక్షరాస్యత రేటు 95 శాతానికి పైగానే. గ్రామంలో ఏ పనైనా గ్రామసభ ఆమోదంతోనే జరుగుతుంది. గ్రామం 2007లో ఈ గ్రామం జాతీయ జల పురస్కారాన్ని అందుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ‘ఆదర్శ గ్రామం’గా ప్రకటించింది. గ్రామానికి చెందిన రైతుల వద్ద ఇప్పుడు బైకులు, కార్లు ఉన్నాయి. వారి పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారు. కలిసికట్టుగా నిలిస్తే ఒక ప్రాంత తలరాతనే మార్చవచ్చని ఈ గ్రామం నిరూపించింది.






