27 July, 2026 | 7:20 PM

హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: టీయూసీఐ

27-07-2026 06:08 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): హమాలీతో పాటు అసంఘటిత రంగ కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించేలా సమగ్ర చట్టం తీసుకురావాలని టీయూసీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జీసీసీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి మాట్లాడుతూ సివిల్ సప్లై, రైస్ మిల్లులు, దాల్, ఆయిల్, ఫ్లోర్, విత్తన శుద్ధి, స్పిన్నింగ్, జిన్నింగ్, డిస్టిలరీస్, బ్రూవరీస్, మార్కెట్లు తదితర సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలు, గుమస్తాలు, ఆపరేటర్లు, మహిళా కార్మికులు, వాచ్‌మెన్‌లకు పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బోనస్, ప్రమాద నష్టపరిహారం వంటి చట్టబద్ధ హక్కులు అమలు కావడం లేదని, చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వం, కార్మిక శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా చాలీచాలని వేతనాలతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, తెలంగాణ ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.