బోటింగ్ సమయంలో లైఫ్ జాకెట్ ధరించడం తప్పనిసరి
వెంకటాపూర్, మే 7 (విజయక్రాంతి): రామప్ప చెరువు వద్ద బోటు ఆపరేటర్లు, టూరిజం శాఖ సిబ్బందికి పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యాటకుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని బోటింగ్ నిర్వహణలో పాటించాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై సిబ్బందికి సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వెంకటాపురం ఎస్ఐ చల్లా రాజు మాట్లాడుతూ ప్రతి బోటుకు నిర్దేశించిన పరిమితికి మించి పర్యాటకులను బోటులోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అలాగే బోటులో ప్రయాణించే ప్రతి పర్యాటకుడు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ ధరించాలని, లైఫ్ జాకెట్ లేకుండా ఎవరినీ బోటింగ్కు అనుమతించవద్దని బోటు నిర్వాహకులకు ఆదేశించారు.
పర్యాటకులు లైఫ్ జాకెట్ ధరించకుండా బోటులో ప్రయాణించిన పక్షంలో పూర్తి బాధ్యత సంబంధిత బోటు నిర్వాహకులదేనని హెచ్చరించారు. వాతావరణ పరిస్థితుల్లో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నప్పుడు, గాలి ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో బోట్లను నడపరాదని సూచించారు. భద్రతా నిబంధనలను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ సమీప బర్గీ డ్యాం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టాలను ఉదాహరణగా వివరిస్తూ, అలాంటి ఘటనలు రామప్పలో జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో బోటు ఆపరేటర్లు, టూరిజం శాఖ సిబ్బంది, పోలీసు సిబ్బందిలు పాల్గొన్నారు.






