‘జావెలిన్’ కొనుగోలుకు సంతకాలు
అమెరికా నుంచి భారత్‌కు క్షిపణి
న్యూఢిల్లీ, ఆగస్టు 28: భారత సైన్యం అమెరికా నుంచి జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణిని కొనుగోలు చేయనుందని, ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఎల్‌వోఎపై సంతకాలు పూర్తి అయ్యాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్ శుక్రవారం మీడియాకు వివరించారు. ఈ క్షిపణిని కేవలం భుజాలపై మోసుకెళ్లి ప్రయోగించవచ్చు. ఇదొక గైడెడ్ క్షిపణి. ముఖ్యంగా కొండప్రాంతాల్లో, అడవులు, క్లిష్టమైన రహదారుల్లో వాహనాలు చేరుకోలేని చోట ఈ సైనికులు ఈ క్షిపణులను భుజాలపై మోసుకెళ్లి సాయుధ వాహనాలు, లక్ష్యాలపై ప్రయోగించొచ్చు.
ఒకసారి క్షిపణిని లక్ష్యం వైపు వదిలితే స్వయంచాలకంగా పనిచేసి చేధిస్తుంది. కాగా భారత్ ఎన్ని క్షిపణులను కొనుగోలు చేయనుంది? ఎప్పుడు అందనున్నాయి? దీని ఖర్చెంత? లాంటి వివరాలను సెర్గియో బయటపెట్టలేదు. జావెలిన్ క్షిపణిని యూఎస్‌లోని లాక్‌హీడ్ మార్టిన్, రైడియన్ అనే ఉమ్మడి సంస్థలు రూపొందించాయి. ప్రయోగానికి ముందే ఇందులోని వ్యవస్థ లక్ష్యాన్ని గుర్తించి దాన్ని లాక్ చేస్తుంది. ప్రయోగం తరువాత ఎవరూ దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉండదు. ఇన్‌ఫ్రారెడ్ ఉండడం వల్ల పగలు, రాత్రి అనే తేడా లేకుండా లక్ష్యాలను గుర్తిస్తుంది, ఛేదిస్తుంది.






