26 August, 2026 | 5:08 AM

ఉద్యమకారులను అవమానిస్తే సహించం

26-08-2026 12:39 AM

ధర్నాచౌక్‌లో ఆత్మగౌరవ దీక్షలో వక్తలు

ముషీరాబాద్, ఆగస్టు 25(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులను అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. తెలంగాణ బ్రాహ్మణ ఐక్యవేదిక, తెలంగాణ బ్రాహ్మణుల ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో మంగళవారం  ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్షను నిర్వహించా రు.

ఈ దీక్షకు బీజేపీ సీనియర్ నాయకుడు వంశ తిలక్, బీఆర్‌ఎస్ నాయకుడు దేవి ప్రసాద్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, కల్లుగీత కార్మిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, ఎమ్మార్పీఎస్ నాయకుడు చింత స్వామి, ప్రముఖ రచయిత అన్వేషిలు హాజరై మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఐక్యవేదిక ప్రతినిధులు డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ, పోచంపల్లి రమణారావు, గంప రామారావు, వూరే ప్రసాద్ రావు, ఆవునూరి రమణారావు, గూడ రాజేశ్వరరావు, రవి కిరణ్, పోలంపల్లి రమణలు మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డల గౌరవం, దళిత మహిళ ల పట్ల అవమానకర వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సామాజిక చైతన్యం కల్పించడమే దీక్ష ప్రధాన ఉద్దేశమన్నారు. తెలంగాణ ఉద్యమకారులను అవమానించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.