13 March, 2026 | 11:05 AM

ప్రైవేటు బిల్లుతో బీసీలను మోసం చేస్తే సహించం

13-03-2026 12:00 AM
  1. రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు రూ.50 వేల కోట్లు నిధులు కేటాయించాలి
  2. కేంద్ర ప్రభుత్వం జన గణనలో బీసీ కుల గణన చేపట్టాలి
  3. సమావేశంలో బీసీ మేధావుల ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు, తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్

ముషీరాబాద్, మార్చి 12(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు వద్దని, తమిళనాడు రాష్ట్రం తరహాలో 9వ షెడ్యూల్ లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పలువురు వక్తలు డిమాం డ్ చేశారు. ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో బీసీ మేధావుల ఫోరం, తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వ ర్యంలో ‘పార్లమెంట్-శాసన సభ బడ్జెట్ సమావేశాలు నేపథ్యంలో బీసీ బిల్లులపై’ చర్చా కార్యక్రమం ఫ్రంట్ కన్వీనర్ బైరి శేఖర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా బీసీ మేధావుల ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు, తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, అంబా ల నారాయణ గౌడ్‌లు మాట్లాడుతూ ఈనెల 16 నుంచి జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు రూ.50 వేల కోట్లు నిధులు కేటాయించాలన్నారు.

బీసీలపై రోజురోజుకు దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న నేపధ్యంలో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న బీసీ విద్యార్థుల ఫీజుల రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్, బీసీ కార్పోరేషన్ కు నిధులు కేటాయించాలని అన్నారు. బీసీలపై ఉన్న క్రిమిలేయర్ ను ఎత్తివేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.

మూడు రాజకీయ పార్టీ లు బీసీలను అణగదొక్కే కుట్రను మానుకోవాలని అన్నారు. లేని పక్షంలో బీసీ లోకం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రంట్ కన్వినర్ లు అయిలి వెంకన్న గౌడ్, ఎస్.దుర్గయ్య గౌడ్, ఎలికట్టె విజయ్ కుమార్, అంబాల నారాయణగౌడ్, భత్తిని కీర్తిలత, శ్రీకాంత్, నాగ భూషణం తదితరులు పాల్గొన్నారు.