ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
నిజాంసాగర్,(విజయక్రాంతి): సర్ కార్యక్రమంలో ఏ ఒక్కరి ఓటు హక్కు కూడా కోల్పోకుండా చూడాలని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. ఆయన బుధవారం నాడు నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సర్ అవగాహన సమావేశంలో మాట్లాతూ... అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు.
సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్, ఎన్నారై భుజం గారి భాస్కర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు సంకు లక్ష్మయ్య, సర్పంచు లు వడ్ల బ్రహ్మం,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






