ఎన్‌ఆర్‌ఐల ఓట్లు పోనివ్వం
- విదేశాల్లో ఉంటున్న తెలంగాణ ఓటర్లకు కేటీఆర్ భరోసా
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో సమీక్ష సమావేశం
- పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం
హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి) : జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై లక్షలాది మంది తెలంగాణ ఎన్‌ఆర్‌ఐల నుంచి ఆందోళన వ్యక్తమవుతుందని, ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి నివాసంలో శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీలు, సీనియర్ నేతలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. సర్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పార్టీ బలోపేతం పై వారికి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే వందలాది మంది ఎన్‌ఆర్‌ఐలు తమ పార్టీ నేతలకు ఫోన్లు చేస్తున్నారని, ప్రతి ఎన్‌ఆర్‌ఐ ఓటు హక్కును కాపాడుతామని హామీ ఇచ్చారు. పార్టీ తరఫున ఒక సీనియర్ ప్రతినిధి, నాయకుల ప్రతినిధి బృందాన్ని, ఎమ్మెల్యేలు, ఎంపీల బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
బూత్ లెవల్ అసిస్టెంట్‌లు తమ పరిధిలోని ఎన్‌ఆర్‌ఐల వివరాలు సేకరించి వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న తెలంగాణ ఓటర్లకు సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇంచార్జీలు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. సమావేశంలో పార్టీ సీనియర్ నేత సురేష్‌రెడ్డి, సభ్యత్వ నమోదు ఇంఛార్జ్ వీ.జీ గౌడ్, జనరల్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి గౌరీకి కేటీఆర్ భరోసా
ఎంబీబీఎస్ చదువుతున్న కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల మండలం, కల్వరాలకు చెందిన బొరెల్లి నర్సింహ కూమార్తె బొరెల్లి గౌరీకి కేటీఆర్ ఆర్థిక సహాయం అందజేశారు.






