31 May, 2026 | 1:21 AM

మోటార్లకు మీటర్లు పెట్టం

31-05-2026 01:05 AM
  1. పెట్టినా.. ఫ్రీ కరెంట్ నిలిపేసినా ఎన్నికల్లో పోటీచేయం 
  2. బీఆర్‌ఎస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్
  3. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించేందుకే రైతు డిస్కం
  4. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది బీఆర్‌ఎస్ నేత పువ్వాడ కాదా? 
  5. బీఆర్‌ఎస్ హయాంలో కమ్మ సంఘానికి 10 ఎకరాల భూమి ఇచ్చారు: సీఎం

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): ‘మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా మేం ఎన్నికల్లో పోటీ చేయం. ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ కొనసాగించినా వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్‌ఎస్ తప్పుకుంటుందా..?’ అని బీఆర్‌ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని సీఎం మండిపడ్డారు.

రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకే రైతు డిస్కం ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. శనివారం  ఎంసీహెచ్‌ఆర్డీలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభు త్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్ వినియోగాన్ని రైతు డిస్కంకు కనెక్ట్ చేస్తున్నా మని, దేశంలోనే మొట్ట మొదటిసారిగా, ఎక్కడాలేని విధంగా రైతు డిస్కంను ఏర్పాటుచేశామని తెలిపారు.

రైతు డిస్కం ఏర్పాటుతో జవాబుదారీతనం పెరుగుతుందని, ప్రభుత్వానికి అవసరాన్నిబట్టి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలుచేసే వెసులుబాటు కలుగుతుందని సీఎం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏడాదికి రూ. 70 వేల కోట్లు అప్పు చేస్తే.. రూ. 95 వేల కోట్ల అప్పు తీరుస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం తీరు స్తున్న అప్పులు గురించి హరీష్‌రావు ఎందు కు చెప్పడం లేదు అని ప్రశ్నించారు. తాము రూ. 54 వేల కోట్ల అప్పులు తీసుకుంటున్నామని ముందే చెప్పామని, ఎఫ్‌ఆర్‌బీఎం పరి ధి దాటి అప్పులు చేయడానికి అనుమతి లేదని  సీఎం పేర్కొన్నారు. 

అబద్ధాల పునాదుల మీదనే.. 

 బీజేపీ, బీఆరెస్ అబద్ధాల పునాదులపై పార్టీలను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘కేంద్ర మంత్రికిషన్‌రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా.. రైతు పండించిన ప్రతీ గింజను మా ప్రభుత్వం కొంటుంది. మేం కొంటున్నది ఎంత.. కేంద్రం కొనేది ఎంత..? కేవలం 32 శాతమే కేంద్రం కొంటోంది. కేంద్రం మద్దతు ధర నిర్ణయించడం వరకే.. ధాన్యం మాత్రం కొనడం లేదు. వరి, జొన్న, మొక్కజొన్నలు మొత్తం మా ప్రభుత్వం కొంటుంది.

మేం కొ న్న పంటలను కేంద్రం కొనాలి. కేంద్రం కొనకపోవడం వల్లే రాష్ట్రంలో రైతు గోస పడు తున్నాడు. కేంద్రం కొనకపోతే బస్సులు వే సుకుని యాత్రలు చేసిన బీజేపీ నేతల ఇళ్లకు ట్రాక్టర్లపై వచ్చి ధాన్యం పోస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే  62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, తడిచిన ధాన్యం కూడా మద్దతు ధరకు కోనుగోలు చేశామని.. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. 

మోదీ మహారాష్ట్రను ఒప్పించలేరా..

అంతర్రాష్ట జల వివాదాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహకార ధోరణితో పరిష్కరించుకోవలని ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్నారని, అందుకే ప్రాణహిత ప్రాజెక్టుపై మహారాష్ట్ర సీఎంతో చర్చలకు ప్రయత్ని స్తున్నామని సీఎం తెలిపారు.  తుమ్మిడిహట్టి కోసం కలిసి మాట్లాడటానికి మహారాష్ట్ర ము ఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరినా స్పం దించడంలేదన్నారు.

పోలవరం కోసం 7 మండలాలను ఏపీకి ఇచ్చిన మోదీ తెలంగాణ కోసం మహారాష్ట్ర నుంచి అనుమ తు లు ఇప్పించలేరా..? అని సీఎం వ్యాఖ్యానించారు. అధికారంలో ఉండగా బీఆర్‌ఎస్ దోచుకుందన్నారు. స్టోన్ క్రషర్ల దగ్గర రూ. 50 లక్షలు వసూలు చేశారని, ఇదుల కుంట చెర్వు గురించి హరీష్‌రావు ఎందుకు మాట్లాడటం లేదని సీఎం ప్రశ్నించారు. 

2034 వరకు రాష్ట్ర రాజకీయాల్లోనే.. 

తాను 2034 వరకు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి పునరు ద్ఘాటించారు. పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, తనది విజయవంతమైన కాంబినేషన్ అని, తాము అన్ని ఎన్నికల్లో గెలిచామని, భ విష్యత్‌లోనూ విజయం సాధిస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌కు మంచి పదవి రావొచ్చన్నా రు.  ఎన్టీఆర్ విగ్రహం విషయంలో జరుతు న్న చర్చపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు.

ఎన్టీఆర్‌కు కులం, ప్రాంతంతో  పోల్చడం  బుద్దిలేని తనమన్నారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టలేదా..? బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో కమ్మ సంఘానికి పది ఎకరాల భూమి ఇవ్వలేదా..? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటికి సురవరం ప్ర తాప్‌రెడ్డి పేరు పెట్టిందే నేను అని అన్నారు.

ఆంధ్రలో తెలంగాణ వాళ్ల విగ్రహాలు ఎందు కు పెట్టడంలేదని అక్కడ పార్టీ పెట్టిన కేసీఆర్ అడగలేదు కదా..? అని సీఎం గుర్తు చేశారు. వివాదాలు, సెంటిమెంట్ రాజకీయాలు చే యాలని తాను అనుకోవడం లేదని, తన దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధిపైనే ఉందన్నా రు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తొందరలేదని ముఖ్యమంత్రి చెప్పారు. 

హరీష్‌రావు ఒట్టేయాలి

బీఆర్‌ఎస్‌లోనే ఉంటానని హరీష్‌రావు ఒట్టేసి చెబుతారా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. గతంలోనూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దగ్గరకు హరీష్‌రావు వెళ్లారని, ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారో తనకు అన్నీ తెలుసని, కానీ వాటన్నింటిని చెప్పలేనని సీఎం పేర్కొన్నారు. ఇటీవల పార్టీ మీ టింగ్ వదిలేసి ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్లారని అని సీఎం ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి పోటీ చేస్తాయనడంలో అనుమానం లేదన్నారు. సీబీఎస్‌ఈలో జవాబుపత్రాలు తారుమారు చేసినా గ్లోబరీనా.. కేటీఆర్ బీనామీ సంస్థ అని సీఎం తెలిపారు.