భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక
కొత్తగూడెం: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి మూడో డేంజర్ మార్క్ దాటింది. దీంతో 15,21,335 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. భద్రాచలం నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం, చర్ల, కూనవరం వైపు రహదారులపై వరద నీరు చేరింది. చర్లలో గోదావరిలో 10 మంది పశువుల కాపర్లు చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది 10 మందిని కాపాడారు. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటిమట్టం 54.8 అడుగులకు చేరింది.
44 మంది కార్మికులు సేఫ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని వీరపురం ఇసుక ర్యాంప్ సమీపంలో ఉన్న ఇసుక తిన్నెపై చిక్కుకుపోయిన 44 మంది కార్మికులను నాలుగు గంటల పాటు సాగిన ఆపరేషన్ తర్వాత సురక్షితంగా రక్షించారు. కార్మికులు ఉదయం ఒక ఇసుక డంపింగ్ యార్డులో దినచర్య పనులు చేయడానికి గోదావరి నదిని దాటారు. కానీ నది వేగంగా ఉప్పొంగి ఇసుక దిబ్బను వరద నీరు చుట్టుముట్టడంతో వారు చిక్కుకుపోయారు. వారు ఫోన్ ద్వారా సమీప గ్రామస్థులను అప్రమత్తం చేయగా, సహాయక బృందాలు వరద సహాయక పడవలు, భారీ యంత్రాలను ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా మొత్తం 44 మంది కార్మికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు అధికారులు ప్రకటించారు.






