తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు
తిరుమల: ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీ.వీ. సింధు(Indian badminton player P.V. Sindhu) శనివారం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి, కొండపై కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. సింధు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం, ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) అధికారులు ఆమెకు గౌరవసూచకంగా శ్రీవారి తీర్థ ప్రసాదాలను, శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్ర చిత్రపటాన్ని అందజేశారు.
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ(Tirumala Devotees) కొనసాగుతుంది. 31 కంపార్ట్‌మెంట్లలో వెంకన్న భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 71,393 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,846 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమల హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.






