రైతన్నతో చెలగాటం
- కాంగ్రెస్ ప్రభుత్వం, దళారుల మధ్య నలిగిపోతున్న అన్నదాత
- సన్నబియ్యం కొనుగోలు చేసి దొడ్డుబియ్యం గాలికి వదిలేశారు
- రాష్ట్రంలో అధ్వానంగా ధాన్యం సేకరణ
- రైతు గోస-బీజేపీ భరోసా యాత్ర చేపట్టే వరకూ కదలని మంత్రులు
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రభు త్వం, దళారుల మధ్య రైతులు నలిగిపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అధ్వానంగా ధాన్యం సేకరణ ఉందని తెలిపారు. అన్ని వనరులు ఉన్నప్పటికీ, ప్రభుత్వ చేతగానితనం, సరైన కార్యాచరణ ప్రణాళిక లేకపోవడంతో పంట చేతి కొచ్చిన సమయంలోనే రైతులు వర్షాల బారినపడి నష్టపోతున్నారని తెలిపారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ‘రైతుల గోస -బీజేపీ భరోసా’ యాత్ర చేపట్టే వరకు కూడా కాంగ్రెస్ మంత్రులు కార్యాలయాల్లోనే పరిమితమయ్యారని, కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకుండా కేవలం ప్రకటనలకే పరిమితమైందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివా రం నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.
మార్పు పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తిచేసుకున్నా, తెలంగాణ రైతుల జీవితాల్లో ఆశించిన మార్పు కనిపించడం లేదన్నారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని, రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు.
కొనుగోళ్లు ఎందుకు చేపట్టలేదు..
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వం, రైస్ మిల్లర్లు, అధికా రులు, దళారీల మధ్య రైతులు నలిగిపోతున్నారని పేర్కొన్నారు. ధాన్యం కొను గోళ్లు కేంద్ర ప్రభుత్వం చేయడం లేదని ముఖ్యమంత్రి, మంత్రులు విమర్శలు చేస్తున్నారన్నారు. అయితే ధాన్యం సేకరణ కేంద్రాల నిర్వహణ, కొనుగోళ్లు, రైస్ మిల్లులకు తరలింపు వంటి బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపాలి.. మిల్లులు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అందించాలన్నారు.
ప్రతి పంట సీజన్‌కు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమావేశమై ఉత్పత్తి అంచనాలు, కొనుగోలు పరిమాణం, నిల్వ సదుపాయాలు, వ్యయభారం తదితర అంశాలపై చర్చించి లక్ష్యాలను నిర్ణయిస్తారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత సమావేశాల్లో ఈ లక్ష్యాలకు అంగీకరించిందని తెలిపారు.
ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి 52.24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిందని, అంటే దాదాపు 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పూర్తిస్థా యిలో కొనుగోళ్లు చేపట్టలేకపోయిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తమ బాధ్యతలను నిర్వర్తించకుండా కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై మోపే ప్రయత్నం జరుగుతోందన్నారు.
దొడ్డు బియ్యం రైతుల భవిష్యత్తేంటి?
గతంలో బీఆర్‌ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్.. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని, రైతుల భవిష్యత్తుపై ఎలాంటి ముం దుచూపు చర్యలు కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సన్నబియ్యం సేకరణపై దృష్టి పెడుతుండగా, దొడ్డుబియ్యం పండిస్తున్న రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, వారి భవిష్యత్తు ఏమిటి?, వారికి అవసరమైన విత్తనాలు, మార్కెటింగ్ సదుపాయా లు ఎక్కడ ఉన్నాయి? అనే ప్రశ్నలకు సమాధానం లేదన్నారు.
గతంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, బిహార్ రాష్ట్రాలు దొడ్డుబియ్యాన్ని కొనుగోలు చేసేవని, ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో కూడా ఉత్పత్తి పెరగడంతో పరిస్థితులు మారాయని, దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలన్నారు. 6 ఎంఎం నుంచి 6.5 ఎంఎం పొడవు గల బియ్యానికి మార్కెట్ డిమాండ్ ఉందని, అయితే అలాంటి వంగడాల సాగుకు అవసరమైన విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
రైతుల అవసరాల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లు, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూవ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి పెడుతోందని, హామీలు, గ్యారంటీల అమలుపై శ్రద్ధ కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని గోదాముల్లో నిల్వ సామర్థ్యం కూడా పరిమితంగా నే ఉందని, మరోవైపు దేశవ్యాప్తంగా ధాన్యం ఉత్పత్తి పెరుగుతోందని, ఈ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.
సమావేశాలు పెట్టండి..
యూరప్, అమెరికా వంటి దేశాలకు బియ్యం ఎగుమతి చేయాలంటే తక్కువ పెస్టిసైడ్స్ వినియోగంతో సాగుచేయాలి, రైతులకు ఆ దిశగా అవగాహన కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు. నరేంద్ర మోదీ ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ సందేశం రైతులకు చేరడంలేదన్నారు. ధాన్యం కొనుగోలు సమస్యలు ఇతర రాష్ట్రాల్లో కనిపించడం లేదని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ పరిస్థితి లేదన్నారు.
గన్నీ బ్యాగుల సరఫరా, రవాణా ఏర్పాట్లు, నిల్వ సదుపాయాల విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని, కనీసం ఆరు నెలల ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కొనుగోలు చేసిన నాణ్యమైన సన్నబియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి, అక్కడి నుంచి తక్కువ నాణ్యత గల బియ్యాన్ని కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. తెలంగాణ రైతుల ఉత్పత్తికి సరైన విలువ దక్కడం లేదన్నారు.
దేశవ్యాప్తంగా సేకరించిన సుమారు 87 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో తెలంగాణ నుంచే 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సేకరించిందన్నారు. క్షేత్రస్థాయిలో కేవలం 7,180 ధాన్యం సేకరణ కేంద్రాలే పనిచేస్తున్నాయన్నారు.
తెలంగాణలో ఉచిత రేషన్ బియ్యం పంపిణీలో ప్రతి కిలోకు కేంద్ర ప్రభుత్వం రూ.41.73 ఖర్చు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.15.69 మాత్రమే ఖర్చు చేస్తోందన్నారు. అయినప్పటికీ పంపిణీ కేంద్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో లేకుండా, కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలతో ప్రచారం చేసుకోవడం సరైంది కాదన్నారు.






