గోదావరి ముంపు ప్రాంతాల్లో అధికారుల అప్రమత్తత
పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు.. అవసరమైతే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచన
బూర్గంపాడు,(విజయక్రాంతి): గోదావరి వరద ఉద్ధృతి నేపథ్యంలో మండలంలోని ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. తహసీల్దార్ కేఆర్‌కేవీ ప్రసాద్, ఎంపీడీవో జమలారెడ్డి, ఎస్‌ఐ మేడ ప్రసాద్, అదనపు ఎస్‌ఐ నాగభిక్షం, ఉపసర్పంచ్ గుండె వెంకన్న, వార్డు సభ్యులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, అందుబాటులో ట్రాక్టర్లను ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలకు చేర్చుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని, అనవసరంగా వరద నీటి వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మండలవ్యాప్తంగా అవసరమైన పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని, ప్రజల భద్రతకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తహసీల్దార్ కేఆర్‌కేవీ ప్రసాద్ తెలిపారు. అధికారులు, సిబ్బంది నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.






