కొల్లాపూర్ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి
కొల్లాపూర్ టౌన్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి(Municipal Chairman Reddy Jyothi) తెలిపారు. శుక్రవారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 19వ వార్డులో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆధ్వర్యంలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డుల్లో చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రతి రోజు ఒక వార్డులో టెంకాయ కొట్టి పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, చెత్తాచెదారం తొలగించడం, మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి కాలువలను శుభ్రం చేయడం ప్రధాన లక్ష్యమని చెప్పారు. స్వయంగా చీపురు పట్టి శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ రహీం బాషా, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, కౌన్సిలర్లు కాటమొని లహరి, బోరెల్లి మహేష్, కర్నే శివ, పెబ్బేటి శేఖర్, పసుల సుజాతతో పాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.




