18 August, 2026 | 3:05 AM

రైతుల పక్షాన పోరాటం చేస్తాం

18-08-2026 12:03 AM
  1. ఎమ్మెల్యే కోవ లక్ష్మి
  2. సాగునీటి కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బూరుగుడా సమీపంలోని జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కెనాల్ ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు వెంటనే ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రైతుల ఆందోళనకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాగునీరు అందకపోతే రైతులు పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అధికారులు వెంటనే వట్టివాగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఎల్నినో సాకుతో సాగునీరు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. భారీ వర్షాలతో వరద నీరు సముద్రంలో కలుస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు.

రైతుల సమస్యలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో అన్నదాతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలుసుకున్న స్థానిక సీఐ రవి సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ రైతులు ఆందోళన విరమించకపోవడంతో డీఎస్పీ అశోక్, ఆర్డీవో లోకేశ్వరరావు అక్కడికి చేరుకున్నారు. రైతులతో పాటు ఎమ్మెల్యే కోవ లక్ష్మితో చర్చించి ఆందోళన విరమించాలని కోరారు.

సాగునీటి విడుదల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కోవా లక్ష్మి ఆందోళనను విరమించారు.ఇచ్చిన మాట ప్రకారం అధికారులు సాగునీరు వదలక పోతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

సాగునీటి కోసం దాదాపు రెండు గంటల పాటు నేషనల్ హైవే రోడ్డుపై రైతులు బయట ఉంచడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, రెబ్బెన సింగిల్ విండో చైర్మన్లు అలీబీన్ హైమద్, సంజీవ్, నాయకులు జీవన్, శ్రీనివాస్, నవీన్తో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.