18 June, 2026 | 3:57 AM

మాకు కావాలి.. తెలంగాణ పబ్లిక్ స్కూల్

18-06-2026 12:00 AM
  1. గబ్బిలాలపేటలో స్కూల్ కోసం బస్తీవాసులు ఏకమవ్వాలి
  2. సాధించే వరకు పోరాటం

జవహర్‌నగర్, జూన్ 17 (విజయక్రాం తి): గబ్బిలాలపేటతో పాటు పరిసర బస్తీల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పబ్లిక్ స్కూల్ను వెంటనే ఏర్పాటు చేయాలని, పాఠశాల సాధించే వరకు తమ పోరాటం ఆగదని బస్తీల వాసులు ఏకమయ్యారు. స్థానిక సమస్యల పరిష్కారం, విద్యా హక్కుల సాధన కోసం పాఠశాల సాధన కమిటీ అధ్వర్యంలో గత కొంతకాలంగా మనోహరంగా ఏర్పడి నిరసన తెలి పారు.

పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వ పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గబ్బిలాలపేట, రాజీవ్ గాంధీనగర్, శాంతినగర్, గిరిప్రసాద్నగర్, నందమూరి నగర్ తదితర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ సరిపడా ప్రభుత్వ విద్యా సంస్థలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ముఖ్యంగా పేద కుటుంబాల పిల్లలు విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ హైస్కూల్ ఏర్పాటు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అని, దీనిని నెరవేర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విద్య అనేది ప్రతి ఒక్కరి రాజ్యాంగ హక్కు అని, ఆ హక్కును సాధించుకునేందుకు ప్రజలంతా ఒక్కటిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పాఠశాల నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రజలతో కలిసి ఉద్యమాలు, నిరసనలు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. విద్య లేకపోతే దేశాభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు.

సమాజ పురోగతికి విద్యే ప్రధాన ఆయుధమని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వాలు మరింత చొరవ చూపాలని సూచించారు. జవహర్నగర్ ప్రాంతంలో లక్ష మందికి పైగా జనాభా ఉన్నప్పటికీ కేవలం రెండు ప్రభుత్వ హైస్కూ ల్లు మాత్రమే ఉండటం విచారకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలల కొరత కారణంగా అనేక మంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారని తెలిపారు.

విద్య అందుబాటులో లేకపోవడం వల్ల బాల కార్మికత్వం, మత్తు పదార్థాల బారిన పడటం వంటి సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాలికల విద్యపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎన్నో సంవత్సరాలు గడిచినా విద్యా మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికీ ప్రజలు పోరాటా లు చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు.

గబ్బిలాలపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థానిక ప్రజలు కమిటీలు ఏర్పాటు చేసుకుని కొంతకాలంగా చేస్తున్న ఉద్యమం అభినందనీయమని కొనియాడారు. కొంతకాలంగా పలువురు ప్రజాప్రతి నిధులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, మహిళలు, యువకులు బస్తీవాసులు పాల్గొన్నారు. గబ్బిలాలపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పా టు జరిగే వరకు ఐక్యంగా పోరాటం కొనసాగించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.