పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్
ఎన్ఐఏ అక్రమ నోటీసును ఉపసంహరించుకోవాలి. సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్
ఖమ్మం, ఏప్రిల్ 10(విజయ క్రాంతి): సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ జాతీయ సహాయ కార్యదర్శి పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడానికి సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ఖమ్మం జిల్లా నాయకులు నామాల ఆజాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా ఉద్యమాలలో క్రియాశీలకంగా పాల్గొంటూ ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల పక్షాన కొట్లాడుతున్న నాయకులకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడం దుర్మార్గం అన్నారు.
విద్యార్థి దశ నుంచి కామ్రేడ్ పోటు రంగారావు పిడిఎస్యు లో క్రియాశీలక పాత్ర పోషించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, పోడు భూముల పోరాటాలలో, సామాజిక ఉద్యమాలలో, క్రియాశీలకంగా పాల్గొంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం కృషి చేస్తున్న నాయకులు. ప్రజా సమస్యల పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు ప్రజాపక్షాన ఉండే నాయకులకు దుర్మార్గపు నోటీసులు పేరుతో వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. అక్రమ నోటీసులు జారీ చేస్తూ ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తే మరింత వేగంగా ప్రభుత్వాలపై నిరసన సెగలు తప్పవన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ఉపయోగించుకొని ఉద్యమాలను అణిచివేయడం కోసం గతంలో డిల్లీ రైతులపై కేసులు, మేధావులపై కేసులు, విద్యార్థి నాయకుల పై ఉప కేసులు, నేడు ప్రజా నాయకులకు దుర్మార్గపు ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడం ప్రజా పోరాటాలను అణిచివేయడంలో భాగమేనన్నారు. పోటు రంగారావుకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడం ప్రజా ఉద్యమాలను అణిచివేయడంలో భాగమేనన్నారు. తక్షణమే వారికి జారీ చేసిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వ అణచివేత చర్యలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్మిస్తూ ప్రజా పోరాటాలను నిర్వహిస్తామన్నారు.




