17 April, 2026 | 4:00 AM

అభివృద్ధే లక్ష్యంగా కలిసి పనిచేయాలి

17-04-2026 12:29 AM

కలెక్టర్ కుమార్ దీపక్

చెన్నూర్, ఏప్రిల్ 16 : ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగాగురువారం చెన్నూర్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి కార్యక్రమానికి జిల్లా పంచాయితీ అధికారి వెంకటేశ్వర్ రావు, మండల తహసిల్దార్ మల్లికార్జున్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మహేష్ ప్రసాద్ తివారి, సి.ఐ. బన్సీలాల్ లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ అర్హులైన లబ్ధిదారులకు పథకాల ఫలాలు అందేలా, అభివృద్ధే లక్ష్యంగా  అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా దాదాపు 3 వేల 500 ఇండ్లు స్లాబ్ స్థాయి వరకు పూర్తయ్యాయని, అర్హత కలిగి ఉండి ఇందిరమ్మ ఇండ్లు రానివారు దరఖాస్తు చేసుకున్నట్లయితే మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డు రానివారు దరఖాస్తు చేసుకున్నట్లయితే నిబంధనల ప్రకారం మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇందిరా మహి ళా శక్తి పథకం ద్వారా సోలార్ పవర్ ప్లాంట్, మందమర్రిలో పెట్రోల్ బంక్ నిర్వహణకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి సి.ఐ. బన్సీలాల్‌తో కలిసి హాజరై రహదారి భద్రత నిబంధనలపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారు లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.