17 April, 2026 | 2:27 AM

ఆర్టీసీ జేఏసీ సమ్మె ఇల్లీగల్

17-04-2026 12:30 AM
  1. కార్మికులు పాల్గొంటే నిబంధనల మేరకు చర్యలు
  2. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ యాజమాన్యం
  3. భయపెట్టేందుకే ఈ ఉత్తర్వులు
  4. జేఏసీ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ఆర్టీసీ జేఏసీ ఈనెల 22 నుంచి తలపెట్టనున్న సమ్మె ఇల్లీగల్ అని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమ్మెలో కార్మికులు పాల్గొంటే నిబంధనల ప్రకారం చర్యలుంటాయని అందులో పేర్కొన్నారు. ఆరు నెలల పాటు సమ్మెకు అనుమతి లేదంటూ గతేడాది డిసెంబర్ 1న ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ఈ ప్రకారం ఈ సమ్మె ఇల్లీగల్ అని తెలిపారు. సమ్మెలో పాల్గొనకుండా కార్మికుల కోసం ప్రత్యేక రిజిస్టర్/కంట్రోల్ చార్ట్‌లో వివరాలు రాయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమ్మెలో పాల్గొనే వారికి ఆ రోజు ఆబ్సెంట్ (గైర్హాజరు) వేయాలని సూచించారు. సమ్మెలో పాల్గొనే కాంట్రాక్ట్, క్యాజువల్ బేసీసీ ఉద్యోగులను నిబంధనల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. రెగ్యులర్ ఉద్యోగులపైనా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

వారిదే ఇల్లీగల్...

ఆర్టీసీ యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వులే ఇల్లీగల్ అని జేఏసీ వైస్ చైర్మన్ ఎం.థామస్ రెడ్డి పేర్కొన్నారు. తాము నిబంధనల ప్రకారమే సమ్మెకు వెళ్తున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ వద్ద చర్చలకు ఆర్టీసీ యాజమాన్యమే గైర్హాజరైందని, అయినా వీరిచ్చిన ఇల్లీగల్ అనే ఉత్తర్వులు ప్రతి ఆరు నెలలకోసారి ఇస్తారని, అది సర్వసాధారణమని కొట్టి పారేశారు. కార్మికులను భయ పెట్టేందుకే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కార్మికులెవ్వరూ భయపడొద్దని, డబుల్ డ్యూటీ చేయొద్దని, సమ్మెను యథాతధంగా చేపడతామని, ఈనెల 22న ఫస్ట్ షిఫ్ట్ నుంచి సమ్మెలో పాల్గొంటామని ఆయన స్పష్టం చేశారు.