13 August, 2026 | 4:29 AM

మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం కృషి చేయాలి

13-08-2026 12:34 AM

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరులో ఘనంగా తిరంగా యాత్ర

పటాన్‌చెరు, ఆగస్టు 12 (విజయక్రాంతి): దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని..యువత శక్తిని సక్రమమైన మార్గంలో వినియోగించినప్పుడే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

మాదక ద్రవ్యాల మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, యువతలో చైతన్యం పెంపొందించే లక్ష్యంతో యువజన వికాస సమితి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన తిరంగా యాత్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

జాతీయ జెండాలను చేతబూని పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, ప్రజలు ఉత్సాహంగా యాత్రలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో పటాన్చెరు వీధులు మార్మోగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ  దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ ప్రగతిలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ నియంత్రణ కేవలం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖతో పాటు ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, సీనియర్ నాయకులు నర్రా బిక్షపతి, వెంకటేష్, బల్వంత్, హమీద్, ధనరాజ్, షకీల్, కొండల్, టింకు, యువజన వికాస సమితి అధ్యక్షులు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి విజయ్ గౌడ్, యువత, విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.