30 May, 2026 | 5:19 AM

కుమ్రంభీం ఆశయాలతో ముందుకు సాగాలి

30-05-2026 12:00 AM
  1. జల్-జంగల్-జమీన్ నినాదం ప్రకృతి-మనిషి సహజీవనానికి ప్రతీక
  2. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 29 (విజయక్రాంతి): అమర వీరుడు కుమ్రం భీం ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని శివ్ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రౌటా సంకెపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కుమ్రం భీం జల్-జంగల్-జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవం-2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రౌటా సంకెపల్లి కేవలం గ్రామం మాత్రమే కాదని, ఆదివాసీ సమాజ వీరత్వం, త్యాగం, ఆత్మగౌరవం, సంస్కృతికి ప్రతీకగా నిలిచే పవిత్ర స్థలమని పేర్కొన్నారు.

కుమ్రం భీం ఇచ్చిన జల్, జంగల్, జమీన్ నినాదం ప్రకృతి-మనిషి సహజీవనానికి ప్రతీక అని, ప్రకృతిని కాపాడే సమాజాన్ని ప్రకృతి కూడా కాపాడుతుందని అన్నారు.గొప్ప సైన్యం లేకపోయి నా హక్కులు, ఆత్మగౌరవం కోసం కుమ్రం భీం ధైర్యసాహసాలతో పోరాడారని, ఆయన త్యాగం దేశానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఆదివాసీ మహానేతల ఆలోచనలు యువతకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. గ్రామోత్సవం ద్వారా గ్రామీణాభివృద్ధి, సంప్రదాయ విద్య, ఆరోగ్యం, సామాజిక చైతన్యానికి ప్రాధాన్యం కల్పించడం అభినందనీయమన్నారు.

మహిళల సాధికారత లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదని గవర్నర్ స్పష్టం చేశారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి, విద్య, గౌరవం, స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. యువత తమ మూలాలు, సంస్కృతి ని మరవకుండా క్రమశిక్షణ, కఠోర శ్రమ, సమాజ సేవ భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు సమాజ భాగస్వామ్యం కూడా అవసరమని పేర్కొన్నారు. రౌటా సంకెపల్లి భవిష్యత్తులో ఆదర్శ ఆదివాసీ అభివృద్ధి కేంద్రంగా నిలుస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామోత్సవం నిర్వహించిన నిర్వాహక కమిటీ సభ్యులు, సామాజిక సేవకులను అభినందించారు.

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ఆత్మగౌరవ పోరాటానికి పునాది వేసిన మహానేత కుమ్రం భీం అని కొనియాడారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు.ఈ సందర్భంగా గవర్నర్ గిరిజన కుటుంబాలకు సౌర విద్యుత్ పలకాలను పంపిణీ చేశారు. అంతకుముందు కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కాంస్య విగ్రహ ప్రతిష్టాపనకు శంకుస్థాపన చేశారు. ఈ 

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కాటేపల్లి వెంకటరమణ, వెడ్మ బొజ్జు పటేల్, పాల్వాయి హరీష్ బాబు, జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, నిర్వాహకులు రాయపూడి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.