5 July, 2026 | 2:40 AM

వన మహోత్సవాలను విజయవంతం చేయాలి

05-07-2026 01:13 AM
  1. నాటిన మొక్కలను సంరక్షించేలా చర్యలు
  2. అటవీశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్
  3. బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా అరణ్య భవన్‌కు రాక
  4. ఆమెకు ఘన స్వాగతం పలికిన అధికారులు

హైదరాబాద్, జూలై 4(విజయక్రాంతి): ప్రతి కార్యక్రమాన్ని నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సమయపాలనతో అమలు చేయాలన్నారు. ముఖ్యంగా వర్షాకాలాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ వనమహోత్సవ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని,నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ సూచించారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాక శైలజా రామయ్యర్ శనివారం తొలిసారి అరణ్య భవన్ కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతం అటవీ ప్రధాన సంరక్షణాధికారి  వినయ్ కుమార్ ఆధ్వర్యంలో శాఖ కార్యకలాపాలపై అధికారులతో కలిసి ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా   రాష్ట్రంలో అమలవుతున్న కాంపా కార్యక్రమాలు, సామాజిక అటవీ ప్రాజెక్టులు, రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వనమహోత్సవ కార్యక్రమాలు, అటవీ సంరక్షణ, అటవీ సంరక్షణ చట్టం కింద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు, అనుమతుల మంజూరు ప్రక్రియ, అటవీ భూములకు సంబంధించిన వివిధ అంశాలు, అలాగే శాఖ చేపడుతున్న ఇతర ప్రధాన కార్యక్రమాల పురోగతిని అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

అనంతరం ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలులో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు.ఎఫ్‌సీఏ పరిధిలోని ప్రతిపాదనలను వేగవంతంగా పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత శాఖలతో సమన్వయం పెంచాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సీసీఎఫ్ లు శరవణన్, ఎస్‌జే ఆశా, ప్రియాంక వర్గీస్, క్షితిజ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.