సాధించాలనే పట్టుదల ఉన్న వారిని ప్రోత్సహిస్తాం...
మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల, మే 13 (విజయక్రాంతి) : ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉన్న వారిని ప్రోత్సహిస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం జిల్లాలోని మందమర్రి మండల కేంద్రంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో టామ్ కామ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి రవికృష్ణ, మందమర్రి మండల తహసిల్దార్ సతీష్ కుమార్, టామ్ కామ్ సంస్థ మేనేజర్ అనిల్ కుమార్ లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సరైన విద్య, నైపుణ్యత కలిగిన వారికి విదేశాలలో మంచి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. విదేశాలలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని, సరైన అర్హత కలిగిన వారికి ఆయా దేశాల భాష నేర్పించి ఉపాధి కల్పించడంలో టామ్ కామ్ సంస్థ మంచిగా పని చేస్తుందన్నారు. జర్మనీ, జపాన్, ఇజ్రాయిల్ దేశాలతో పాటు గ్రీస్, యూరోప్ వంటి దేశాలలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని, నైపుణ్యత, అనుభ వం కలిగిన వారి కొరకు ఆయా దేశాలు సంప్రదిస్తున్నాయని తెలిపారు.
అర్హత, నైపుణ్యత గల వారికి ఆయా దేశాలలో వారానికి 35 గంటల పని ఉంటుందని, దాదాపు 2 లక్షల రూపాయల వరకు వేతనం వస్తుందని తెలిపారు. ఈ క్రమంలో యువతకు ఉపాధి కల్పించడంలో మందమర్రి ప్రాంతంలో శిక్షణ కేంద్రం ప్రారంభించడం సంతోషంగా ఉందని, జూన్ 10 నుంచి ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
నర్సింగ్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వంటి అనేక రంగాలలో నైపుణ్యత గల అభ్యర్థుల కోసం అవకాశాలు సిద్ధంగా ఉన్నా యని తెలిపారు. ప్రభుత్వంటామ్ కామ్ సంస్థకు రూ. 90కోట్లు అందించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మందమర్రి నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తరువాత బ్యాచ్ కు ఆదర్శంగా మారాలని తెలిపారు.
క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు వెళ్లాలని, చిత్తశుద్ధితో పనిచేసి డబ్బులు సంపాదించుకోవాలని, మనతో పాటు మరింత మందికి అభివృద్ధి చెందే అవకాశం కల్పించి చేయూత అందించాలని తెలిపారు. మనం కష్టపడి సంపా దించి ఖర్చు పెడితే గౌరవం ఉంటుందని, మన కుటుంబాన్ని సక్రమంగా చూసుకోవచ్చని తెలిపారు. పారిశ్రామిక శిక్షణా సంస్థ, సింగరేణి సంస్థల ద్వారా అనేక మంది శిక్షణ పొంది, అప్రెంటిస్ పూర్తి చేసి అనుభవం పొందుతున్నారని, ఏకాగ్రతతో విదేశీ భాషను నేర్చుకొని విదేశాలలో పనిచేసే అవకాశం సంపాదించుకోవాలని తెలిపారు.
ఈ క్రమంలో విదేశాలలో ఉన్న అవసరాలకు అనుగుణంగా అర్హత, ఆసక్తి గల అభ్యర్థులకు శిక్షణ అందించడం జరుగుతుందని, యువ త తమ వివరాలను నమోదు చేసుకొని శిక్షణ పొందాలని తెలిపారు. ఈ క్రమంలో విదేశాలలో పనిచేస్తున్న మన దేశ పౌరులతో మాట్లాడినప్పుడు తాను చేసే పనికి, వచ్చే జీతానికి సంతోషంగా ఉందని, తమ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటున్నామని తెలిపినట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆలోచనతో ముం దుకు వెళ్లాలని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హత, ఆసక్తి గల నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని తెలిపారు.






