డిపిఆర్ లో భారీ అవినీతి
రూ 8 కోట్ల మేరకు కుంభకోణం
అప్పుచేసి అభివృద్ధి అవసరమా..
నాడు వ్యతిరేకించి.... నేడు అంగీకరించడం పార్టీ సిద్ధాంతమా?
ప్రశ్నించిన కార్పొరేటర్లు కంబపాటి దుర్గాప్రసాద్, భీమా శ్రీవల్లి
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పేరుతో కార్పొరేషన్ ప్రజలపై పెను భారం మోపే ప్రయత్నం చేస్తున్నారని , డి పి ఆర్ పేరుతో రూ 8 కోట్లు పక్కదారి పట్టాయి అంటూ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు కంభంపాటి దుర్గాప్రసాద్, బీమా శ్రీవల్లి ధ్వజమెత్తారు. శుక్రవారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత నెల 6వ తేదీన ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రూ 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రణాళిక రూపొందించారు.
వాటిలో రూ 300 కోట్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిధులు కాగా, మరో 300 కోట్లు జర్మనీ బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు అన్నారు. జర్మనీ బ్యాంకుకు 13 శాతం వడ్డీతో ప్రతి ఏటా 39 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 600 కోట్ల అభివృద్ధి పనులకు గాను డి పి ఆర్ నిమిత్తం రూ 9.60 కోట్లు ప్రతిపాదించారని, డిపిఆర్ లో భారీ కుంభకోణం చోటుచేసుకుందని వాళ్ళ ఆరోపించారు. డిపి అరుకు కేవలం రూ 1.60 కోట్లు మాత్రమే అవసరమంటుందని, మిగిలిన రూ 8 కోట్లు వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
గతంలో ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు ఉన్న హయాంలో రూ 44 కోట్ల ప్రపంచ బ్యాంకు అప్పు కోసం ప్రయత్నిస్తే మాజీ ఎమ్మెల్యే హోదాలో ప్రస్తుత ఎమ్మెల్యే సాంబశివరావు ధర్నా చేసి వ్యతిరేకించారని, ప్రస్తుతం జర్మనీ బ్యాంకుకు 300 కోట్లు అప్పుకు ఎందుకు అనుమతించారని, పార్టీ సిద్ధాంతం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కిన్నెరసాని జలాలపై ఆనాడు రూ 22 కోట్లతో చేపట్టిన పథకం ప్రస్తుతం అసలు వడ్డీ కలిపి 220 కోట్లకు చేరుకుందని, ఆ అప్పునే ప్రస్తుతం చెల్లించలేని పరిస్థితిలో మున్సిపల్ కార్పొరేషన్ ఉంది.
మూలిగే నక్కపై తాటి పండు అన్న చందాన జర్మనీ బ్యాంకు నుంచి 300 కోట్లు అప్పు చేయటం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలపై పన్నుల భారం మోపటమేనని వారన్నారు. చేపట్టే అభివృద్ధి పనుల్లో ఆర్టీసీ బస్టాండ్ స్థానంలో కొత్త బస్టాండ్ నిర్మాణం చేయడం, సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం, కొత్త మున్సిపల్ కార్పొరేషన్ భవనం నిర్మాణం చేపట్టడని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వాటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు ప్రయత్నం చేయాలి తప్ప, అప్పు చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు స్పష్టం చేశారు. ఆదాయ వనరులు లేని మున్సిపల్ కార్పొరేషన్ పై అప్పుల భారం మోపటం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా జర్మనీ బ్యాంక్ నిధుల ప్రతిపాదనను విరమించుకోవాలని, డి పి ఆర్ లో పక్కదారి పట్టిన 8 కోట్ల వివరాలు బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు.






