7 August, 2026 | 10:43 PM

ఆలయ పునర్నిర్మాణంపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

07-08-2026 09:44 PM

అర్చకులు భావోద్వేగానికి గురి కాలేదు

ఉప ప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్ర శర్మ

భూపాలపల్లి/కాళేశ్వరం,(విజయక్రాంతి): కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానo అర్చకులు ఆలయ పునర్నిర్మాణంపై ఇటీవల సోషల్ మీడియా వేదికగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో ఆలయ అర్చకులు భావోద్వేగానికి గురయ్యారు. ఆలయ కూల్చివేతను వ్యతిరేకిస్తున్నారు అనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థాన అర్చకులమంతా ఏకగ్రీవంగా స్పష్టం చేస్తున్నాము.

మేము ఎవ్వరూ ఆలయ పునర్నిర్మాణానికి వ్యతిరేకం కాదు. ఆలయ పునర్నిర్మాణం విషయంలో ఎలాంటి బాధ, ఆవేదన లేదా భావోద్వేగానికి గురికాలేదు. దీనికి విరుద్ధంగా వేల సంవత్సరాల చారిత్రక, ఆధ్యాత్మిక వైభవం కలిగిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం మరింత వైభవంగా, శాస్త్రోక్తంగా, కృష్ణశిలతో శాశ్వత రాతి కట్టడంగా పునర్నిర్మాణం కావడం మా అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములం కావడం ప్రతి అర్చకునికీ గర్వకారణంగా భావిస్తున్నాము.

ఆలయ పునర్నిర్మాణం ఎలాంటి తొందరపాటు నిర్ణయం కాదు. ఆగమ శాస్త్ర నిపుణులు, వేద పండితులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, శృంగేరి శారదా పీఠం జగద్గురువుల మార్గదర్శకత్వంలో అన్ని శాస్త్రోక్త నియమాలను పాటిస్తూ ఈ కార్యక్రమం చేపట్టబడింది. శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారి అనుమతి, ఆశీస్సులు తీసుకున్న అనంతరమే ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులతో పాటు ఆలయ అర్చకులమంతా శృంగేరికి వెళ్లి జగద్గురువుల ఆశీస్సులు పొంది, వారి సూచనల మేరకు పనులు ప్రారంభించాము.అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హనుమంతరావు ఆధ్వర్యంలో జూన్ 16న ఆలయ అర్చకులు, ముఖ్య అర్చకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు, విలేకరులతో సమావేశం నిర్వహించి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలను ప్రజలకు వివరించడం జరిగింది. అనంతరం జూన్ 17న శృంగేరి పీఠం శిష్యుల ఆధ్వర్యంలో కళాపకర్షణం నిర్వహించి, ద్వారబంధనం చేసి, ఆదిముక్తీశ్వర స్వామి ఆలయంలో బాలాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రస్తుతం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యాభిషేకాలు, నిత్యార్చనలు, కాలసర్ప దోష నివారణ పూజలు, శని (నవగ్రహ) పూజలు, ఇతర శాస్త్రోక్త పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.198 కోట్లతో కాళేశ్వర క్షేత్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం తొలగిస్తున్న గర్భాలయం 1982లో నిర్మించబడింది. కాలక్రమేణా అది శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు నిర్మాణంలో పలు భాగాలు దెబ్బతిన్నాయి. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లు, ఆగమ శాస్త్ర పండితుల సూచనల మేరకు ప్రభుత్వం పునర్నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

ఈ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయాన్ని కృష్ణశిలతో శాశ్వత రాతి కట్టడంగా నిర్మిస్తున్నారు. రాతి కట్టడాలు వందల సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా నిలిచి భారతీయ దేవాలయ నిర్మాణ వైభవానికి ప్రతీకలుగా నిలుస్తాయి. భవిష్యత్ తరాలకు కాళేశ్వర క్షేత్రాన్ని మరింత వైభవంగా అందించాలనే సంకల్పంతో ఈ మహత్తర కార్యక్రమం కొనసాగుతోంది.కాబట్టి ఆలయ అర్చకులు బాధపడుతున్నారని, భావోద్వేగానికి గురయ్యారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారం. ప్రజలు, భక్తులు ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని మనవి చేస్తున్నాము. దేవస్థానం అధికారికంగా విడుదల చేసే సమాచారాన్నే విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.ఈ సమావేశంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు శ్రీ పనకంటి పనీంద్ర శర్మ, , ముఖ్య అర్చకులు ఆరుట్ల రామాచార్యులు, అర్చకులు గట్టు రాము, రామకృష్ణ, శరత్ చంద్ర శర్మ, పవన్ శర్మ, విజయ్ శర్మ, రాజు శర్మ, ఫణి శర్మ, రాధాకృష్ణ శర్మ తదితర ఆలయ అర్చకులు పాల్గొన్నారు.