28 April, 2026 | 4:34 AM

భారమవుతున్న వాటర్ బాటిల్స్!

28-04-2026 01:36 AM

ప్రయాణికుల జేబులకు కత్తెర

ఎంఆర్పీకి మించి అధిక వసూళ్లు

దాహాన్ని దోపిడీగా మార్చుకుంటున్న వ్యాపారులు

చిట్యాల, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): దేశ అభివృద్ధికి దోహదపడుతున్న జాతీయ రహదారులు లక్షలాది కుటుంబాలకు ఉపాధి మార్గాలను అందిస్తున్నాయి. రహదారుల పక్కన ఉన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, చిన్నచిన్న దుకాణాలు ఎన్నో కుటుంబాల జీవనోపాధికి ఆధారంగా నిలుస్తున్నాయి. అయితే ఇదే అవకాశాన్ని కొంతమంది వ్యాపారులు దుర్వినియోగం చేస్తూ ప్రయాణికులను బలవంతపు దోపిడీకి గురిచేస్తున్నారు.

ఇటీవల పలుచోట్ల బస్టాండ్లు, రహదారుల పక్కన ఉన్న హోటళ్లు, షాపుల్లో ఎంఆర్పీ ధర కంటే అధికంగా చార్జీలు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. పిల్లలు తినే బిస్కెట్ ప్యాకెట్లు, చిప్స్, నీటి బాటిల్స్ వంటి సాధారణ వస్తువులకే అధిక ధరలు చెప్పడం సాధారణమైపోయింది.పిల్లలు మారం చేయడంతో తల్లిదం డ్రులు ఎలాంటి వాదనలు చేయలేక తప్పనిసరై  కొనుగోలు చేయాల్సి వస్తుందని ప్ర యాణికులు వాపోతున్నారు. అలాగే టిఫిన్ సెంటర్లలో కూడా మామూలు ధరల కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయడం ప్రయాణికులకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది.

జాతీయ రహదారులలో ఉన్న హోటల్స్ లో, బస్టాండ్ లలో, దుకాణాలలో వేలాది మంది ప్రయాణికులు రోజు ఒకే సమస్యను ఎదుర్కొంటున్నారు. రోడ్డు పక్కన ఉన్న కొంత మంది వ్యాపారులు ఎమ్మా ర్పీ ధరల కంటే అధిక ధరలకు వస్తువులను విక్రయించడం సర్వసాధారణంగా మారింది. దీనివల్ల సాధారణ ప్రజలు ముఖ్యంగా బస్సు ప్రయాణికులు కుటుంబాలతో ప్రయాణించేవారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలంలో తాగునీటి అవసరం పెరగడంతో వ్యాపారులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా ఉపయోగిం చుకుంటున్నారని వారు చెబుతున్నారు.  

దాహాన్ని దోపిడీగా మార్చుకుంటున్న వ్యాపారులు

ఎంఆర్పీ ధరపై అదనంగా రూ.5 నుంచి రూ 10 వరకు వసూలు చేస్తున్నారు. బిల్లులు ఇవ్వకుండా నగదు మాత్రమే తీసుకోవడం. ఇక్కడ రేట్లు ఇలానే ఉంటాయి అంటూ వినియోగదారులను బెదిరించడం సాధారణమైపోయింది. రాత్రి సమయాల్లో ఎక్కువ ధరలు వసూలు చేయడం.

రహదారుల వెంట ఉన్న వ్యాపారులు కొంతమంది ఈ రకమైన అక్రమాలకు పాల్పడుతుండగా, బస్టాండ్లలో ఉన్నటువంటి దుకాణదారులు వాటర్ బాటిల్స్ పై, బిస్కెట్ ప్యాకెట్ చీప్ మొదలైన వాటిపై 5 నుండి 10 రూపాయల వరకు అదనంగా వసుళ్ళకు పాల్పడుతున్నారు. ప్రశ్నించిన ప్రయాణికులకు మా షాప్ లో రేటు ఇంతే ఇష్టమైతే కొనండి లేదంటే వెళ్ళండి అని  సమాధానం ఇస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.

ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

ప్రయాణికులు చెబుతున్నదేమిటంటే, దూర ప్రయాణాల్లో తప్పనిసరిగా ఆగాల్సి రావడం వల్ల ఈ దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. అప్పుడు వ్యాపారులు ఇదే అవకాశంగా తీసుకుని అధిక ధరలు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. నీటి బాటిల్ మీద ఎంఆర్పీ రూ.20 ఉంటే రూ.25 తీసుకుంటున్నారు.

అడిగితే ఇష్టం లేకపోతే కొనొద్దంటున్నారు అని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం ఎంఆర్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేయడం చట్ట విరుద్ధం. ప్రతి వస్తువుపై ముద్రించిన గరిష్ట చిల్లర ధర ( ఎమ్మార్పీ) కంటే అధికంగా తీసుకోవడం నేరం. అయినప్పటికీ పర్యవేక్షణ లోపంతో ఇలాంటి అక్రమాలు కొనసాగుతున్నాయి. 

అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి

వివిధ ప్రాంతాల్లో పర్యవేక్షణ తక్కువగా ఉండటం, తనిఖీలు సరిగా జరగకపోవడం వల్ల వ్యాపారులు నిర్భయంగా అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పుడప్పుడూ తనిఖీలు చేసినా, కఠిన చర్యలు లేకపోవడం వల్ల పరిస్థితి మారడం లేదని అంటున్నారు.  బస్టాండ్లు, హైవే హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు చేయాలి. ఎంఆర్పీకి మించి వసూలు చేసే వారిపై జరిమానాలు విధించాలి.  ప్రతి షాపులో ధరల జాబితా తప్పనిసరిగా ప్రదర్శించాలి. వినియోగదారుల ఫిర్యాదులకు ప్రత్యేకంగా  ఏర్పాటుచేసిన  నేషనల్ హెల్ప్లైన్   నెంబర్లకు 1800-11-4000 & 1915 సమాచారం అందించినట్లయితే  అధికారులు చర్యలు తీసుకుంటారు.

జాతీయ రహదారులు ఉపాధి మార్గాలు మాత్రమే కాదు, ప్రజలకు సేవలు అందించే కేంద్రాలు కూడా. ఈ సేవలను దోపిడీగా మార్చే కొందరు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే వినియోగదారులకు న్యాయం జరుగుతుందని, అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ధర దోపిడీపై సంబంధిత అధికారులు వెంటనే నిర్లక్ష్యం వీడి స్పందించి కట్టడి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది అని పలువురు వాపోతున్నారు.

వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు 

బస్సులో ప్రయాణిస్తూ వేడిని తాళలేక ప్రయాణం మధ్యలో దాహం వేసి నీటి కోసం బస్టాండ్ లోని షాపుకు  వెళ్లి అడగగా ఒక్క బాటిల్ వాటర్ బాటిల్ పై ఎమ్మార్పీ కంటే అదనంగా ఐదు రూపాయలు అధికంగా వసూలు చేసి నిలువు దోపిడి చేస్తున్నారు. ప్రయాణ మధ్యలో బయటకు వెళ్లి తీసుకోలేక తప్పని పరిస్థితిలో అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. అధికారులు దీనికి అడ్డుకట్ట వేయాలి.

రాకేష్, ప్రయాణికుడు