28 April, 2026 | 2:50 AM

మూడు చింతలపల్లిలో అక్రమ నిర్మాణాలు.. నిబంధనలు పాటించకుండానే కట్టడాలు

28-04-2026 01:29 AM
  1. తూతూ మంత్రంగా నోటీసులు..  ఆ వెంటనే తిరిగి నిర్మాణాలు
  2. అధికారుల పర్యవేక్షణ లోపమే కారణాలు..

శామీర్ పేట్, ఏప్రిల్ 27 ( విజయ క్రాంతి ): మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఎవరైనా సామాన్య ప్రజలు  ఇంటి నిర్మాణం చేపట్టాలి  అంటే అనుమతులు తప్పనిసరి అని హడావిడి చేసే మున్సిపాలిటీ అధికారులు ఈ అక్రమ నిర్మాణాలకు ఇలాంటి అనుమతులు వర్తించవా అని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఈ అక్రమ నిర్మాణాలకు  అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయం కూడా అధికారులకు తెలియకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. 

అక్రమ నిర్మాణదారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. మూడు చింతలపల్లి మున్సిపాలిటీకి పక్కనే ఆనుకొని కరకపట్ల పరిశ్రమలు ఉండటంతో రియల్ వ్యాపారులు , బిల్డర్లు ఈ ప్రాంతంపై దృష్టి సారించారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం మూడు చింతలపల్లి మండలాన్ని నూతన మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.

 పర్యవేక్షణ లోపం

ఇండ్ల నిర్మాణాలు,ఇతర నిర్మాణాల అనుమతులను టౌన్ ప్లానింగ్ విభాగం మానిటర్ చేస్తుంది. పర్యవేక్షణ కొరవడటంతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునే వారే కరువయ్యారంటే మున్సిపల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో పర్యటించి అనుమతుల మేరకే నిర్మాణాలు కొనసాగుతున్నాయా లేదా అని అధికారులు పరిశీలించడం లేదు. ఇక అనేకచోట్ల భవనాలు,  షెడ్ నిర్మాణాలు  పూర్తయినా అధికారులు అసెస్మెంట్ చేసి..

ఇంటి నంబర్లు కేటాయించడం లేదు. అక్రమ కట్టడాలు గుర్తించకపోవడం, పూర్తయిన నిర్మాణాలకు అస్సెస్మెంట్ చేయకపోవడంతో మున్సిపాలిటీ ఆదాయానికి గండి పడుతోంది. కొన్ని సందర్భాల్లో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లగానే కేవలం నోటీసులు ఇచ్చి సరిపెడుతున్నారు. ఆ తర్వాత పట్టించుకోకుండా నిద్ర నటిస్తున్నారు. అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 అక్రమ నిర్మాణాలపై కమిషనర్ పవన్ కుమార్ ను సంప్రదించగా అక్రమ నిర్మాణాలగురించి టౌన్ ప్లానింగ్ అధికారి చూసుకుంటారు. అయినా మా దృష్టికి వచ్చిన అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేశాము. ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా లేదా అని డాక్యుమెంట్ చూసి వాటికి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.