2 April, 2026 | 2:49 AM

జన్ విశ్వాస్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గళమెత్తిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

02-04-2026 12:51 AM

వరంగల్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): జన్ విశ్వా స్ (సవరణ) బిల్లుపై లోక్సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ప్రజా విశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం పార్లమెం ట్ చర్చ లో పాల్గొన్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ చిన్నచిన్న నేరాలను డీక్రిమినలైజ్ చేయ డం, వ్యాపార సౌలభ్యం పెంపు పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లు నియంత్రణ వ్యవస్థలను బలహీనపరిచే ప్రమాదం ఉందన్నారు.

శిక్షలను తగ్గిం చడం, కొన్ని నేరాలను క్రిమినల్ పరిధి నుంచి సివిల్ పరిధికి మార్చడం వల్ల అమలు యం త్రాంగం బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రజా ఆరోగ్యం, పర్యావరణం, వినియోగదారుల హక్కులకు సంబంధించిన రంగాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉం డొచ్చని పేర్కొన్నారు. శిక్షలు తగ్గించడం ద్వారా మాత్రమే ప్రజా విశ్వాసం ఏర్పడదని వరంగల్ ఎంపీ కావ్య స్పష్టం చేశారు. పారదర్శక పాలన, కఠిన బాధ్యతాయుత వ్యవస్థల ద్వారానే నిజమై న నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు.

ప్రతిపాదిత సవరణలు పెద్ద కార్పొరేట్ సంస్థలకు లాభదాయకంగా మారి, సాధారణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదనంగా, బిల్లుపై విస్తృత స్థాయి చర్చలు, స్టేక్హోల్డర్లతో సంప్రదింపులు జరగలేదని పేర్కొంటూ, దీనిని పార్లమెంటరీ స్థాయి స్థాయీ సంఘానికి పంపాలని డిమాండ్ చేశారు. సంస్థాగత పర్యవేక్షణకు భంగం కలిగించే అంశాలను ప్రభుత్వం పునఃసమీక్షించాలని కోరారు. ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, సమతుల్యమైన, సంప్రదింపులతో కూడిన చట్ట నిర్మాణం అవసరమని వరంగల్ ఎంపీ పేర్కొన్నారు.