పరువు తీసేలా వాల్ పోస్టర్లు
పెళ్లి ఆపడానికి ప్రేమికుడి వికృత చేష్ట
సిద్దిపేట క్రైం, (విజయక్రాంతి): ప్రేమించిన యువతికి పెళ్లి నిశ్చయం కావడం జీర్ణించుకోలేని ఓ యువకుడు కుట్ర పన్నాడు. పెళ్లి ఆపడానికి యువతి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా అపోహలు సృష్టించాడు. అందుకు సహకరించిన స్నేహితులతోపాటు ఆ యువకుడిపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీపీ రవీందర్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన దొడ్ల వెంకటేశ్ అనే యువకుడు ఎన్సాన్ పల్లి గ్రామనికి చెందిన ఒక యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు.
ఇటీవల ఆమెకు తల్లిదండ్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి గ్రామనికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని వెంకటేశ్ ఆమె వివాహం ఆపడానికి స్నేహితులతో కలిసి కుట్ర పన్నాడు. యువతి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా పోస్టర్లు తయారు చేయించి, స్నేహితుల సహకారంతో ఈ నెల 7న రాత్రి సమయంలో తంగళ్లపల్లి, ఎన్సాన్‌పల్లి గ్రామాలలో వాటిని అతికించారు. ఈ విషయమై యువతి కుటుంబీకులు సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, వెంకటేష్, అతడి స్నేహితులు వన్నెల అశ్విత్ కుమార్ అలియాస్ బన్నీ, బండి భాను ప్రసాద్ అలియాస్ దినేష్, భాను ప్రసాద్, బురుజుకింది ఈశ్వర్, రాజబోయిన నవీన్ కుమార్ లను అరెస్టు చేసినట్టు ఏసీపీ రవీందర్ తెలిపారు.






