1 August, 2026 | 1:56 AM

గిరిజన గురుకులం.. సమస్యల సుడిగుండం..

01-08-2026 12:00 AM

తుంగతుర్తిలో ఇంటర్ బోధనకు అధ్యాపకులు కరువు 

  1. గ్రూపుల్లో జోరుగా విద్యార్థులు..  బేజారుగా వసతులు
  2. అధికారులు సమస్యలను తీర్చాలంటున్న విద్యార్థులు 

తుంగతుర్తి, జూలై 31 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గిరిజన కుటుంబాల విద్యార్థుల అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలలో  ఏర్పాటుచేసి, ఉచిత వసతి గృహాలతో పాటు బోధన చేపడుతున్నారు. అయితే ఆయా కళాశాలలు, పాఠశాలల్లో వసతులు సక్రమంగా లేకపోవడంతో గురుకులాలు సమస్యల సుడిగుండాలుగా మారాయనే విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

 బోధన సిబ్బంది కొరత : 

జిల్లాలోని తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల కళాశాలలో సుమారు 600 పైచిలుకు విద్యార్థులు ఉన్నారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి గురుకులానికి వచ్చి, విద్యను అభ్యసిస్తుంటారు. అయితే ఆ కళాశాలలో గడిచిన 2025-26 విద్యా సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులలో మొత్తం 80 మంది విద్యార్థులు ఉన్నారు. గడిచిన సంవత్సరం నుండి, నేటి వరకు గ్రూపులకు సంబంధించిన ఫిజిక్స్, ఎకనామిక్స్ , తెలుగు తదితర సబ్జెక్టులకు లెక్చరర్లు లేరు.                

గెస్ట్ లెక్చరర్లతో కొనసాగిన బోధన : 

రెగ్యులర్ అధ్యాపకులు లేని కారణంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఖాళీగా ఉన్న సబ్జెక్ట్ లను గెస్ట్ లెక్చరర్ లతో ఉత్తమమైన బోధన అందించారు. అయితే గత సంవత్సరమే గెస్ట్ లెక్చరర్లు రాని కారణంగా సంబంధిత పాఠశాల సిబ్బందితోనే పలు సబ్జెక్టులు బోధింపజేశారు.

ఈసారి మారని తీరు : 

ఈ 2026-27 సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న.. ఇప్పటి వరకు కళాశాలకు సరిపడా అధ్యాపకులు లేకపోవడం గమనించిన కొందరు తల్లిదండ్రులు గురుకులాలకు వచ్చిన కొంతమంది విద్యార్థులను తిరిగి వేరొక గురుకులానికి టిసిలు తీసుకునీ వెళ్లిపోతున్నారు.            

ఎమ్మెల్యే దృష్టికి పోయినా తీరని సమస్య : 

ప్రస్తుత 2026-27 విద్యా సంవత్సరంలో తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేలు కళాశాలలో అభివృద్ధి పనులు శంకుస్థాపనకు రాగా స్థానికులు ప్రిన్సిపల్,  లెక్చరర్ లు లేరనే విషయమును ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కళాశాలలో మొత్తం 10 లెక్చరర్స్ గాను కేవలం 5 గురు మాత్రమే ప్రస్తుతం బోధన కల్పిస్తున్నట్లు తెలిపారు. దీనితో  సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడి, గెస్ట్ లెక్చరర్ ఏర్పాటు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అలాగే కళాశాలలోని సమస్యలను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే కళాశాల ప్రారంభమై సుమారు మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రెగ్యులర్ అధ్యాపకులు రాకపోకా కనీసం గెస్ట్ లెక్చరర్ లను కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కావున జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, చొరవ చూపి సమస్యను తక్షణమే పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కోరుతున్నారు.

గెస్ట్ లెక్చరర్ల నియామకం తక్షణమే చేపట్టాలి..

గడిచిన రెండు సంవత్సరాల నుండి గిరిజన గురుకులం జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూపులలో పూర్తిస్థాయి లెక్చరర్లు లేకపోవడం, దారుణం, పదిమంది అవసరం ఉన్నచోట, కేవలం ఐదుగురే ఉన్నారు, ఫిజిక్స్ , ఎకనామిక్స్, తెలుగు తదితర ఖాళీగా ఉన్న సబ్జెక్టులకు తక్షణమే సంబంధిత అధికారులు నియమకం చేపట్టాలి.

 పూర్ణ నాయక్, 

సేవాలాల్ సేన నియోజకవర్గ అధ్యక్షుడు