50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి
- బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలి
- బీసీలకు అవి రాజ్యాంగబద్దమైన హక్కు: ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, జూలై 31(విజయక్రాంతి): శాసనసభలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓబీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిం చే బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని శుక్రవారం జరిగిన రాజ్యసభలో జాతీ య బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్య, ఉపాధి రంగాల్లో 27 శాతం రిజర్వేషన్లు, పంచాయతీరాజ్ సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు ఉన్నప్పటికీ శాసనసభలు, పార్లమెంట్‌ల్లో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం తీవ్ర వివక్ష అని ఆయన అన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు అమల్లో ఉండగా, మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిన కేంద్రం బీసీలకు మాత్రం రాజకీయ రిజర్వేషన్లు క ల్పించలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభలు బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని పలు మా ర్లు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాయని గుర్తు చేశారు.
దేశ జనాభాలో 56 శాతం ఉన్న ఓబీసీలకు పార్లమెంట్లో కనీస ప్రాతినిధ్యం కూడా లేదని, 29 రాష్ట్రాల్లో 11 రాష్ట్రాల నుంచి ఒక్క ఓబీసీ ఎంపీ కూడా ఎన్నిక కాలేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు రాయితీలు కాదని, అవి రాజ్యాంగ బద్ధమైన హక్కు అని ఎంపీ కృష్ణయ్య స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో సమాన భాగస్వామ్యం కోసం శాస నసభలు, పార్లమెంట్‌లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.






