16 July, 2026 | 1:26 AM

పారదర్శకంగా తాడిచర్ల డేంజర్ జోన్‌లో భూ సేకరణ విచారణ ప్రక్రియ

16-07-2026 01:12 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి, జూలై 15 (విజయక్రాంతి): తాడిచర్ల డేంజర్ జోన్ పరిధిలోకి వచ్చే ప్రతి ఇంటిని తనిఖీ చేయాలని, విచారణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, నిర్వాసితుల విచారణ కోసం ఐదు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసినట్లు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 17 నుండి జరిగే విచారణకు ప్రతి టీమ్కు నాయబ్ తహసీల్దార్ పర్యవేక్షణ ఉంటుం దని, గిర్దావర్,

సీనియర్ లేదా జూనియర్  అసిస్టెంట్, పంచాయతి కార్యదర్శి, గ్రామ పాలన అధికారి, జెన్కో ఏఈలు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఎలాంటి వత్తిళ్లు, పైరవీలు లేకుండా విచారణను నిష్పక్షపా తంగా నిర్వహించాలని సూచించారు. డేంజ ర్ జోన్లోని ప్రతి ఇంటిని తనిఖీ చేసి చెక్లిస్ట్ ప్రకారం కుటుంబ వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని, ప్రతిరోజు పూర్తి చేసిన ఫారాలను కాటారం ఆర్డిఓ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు.

నెలాఖరు నాటికి వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేయాలి

భూపాలపల్లి వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను ఈ నిరాకరణ నాటికి పూర్తి చేసి అప్పగించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో వైద్య కళాశాల భవన నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖలకు సంబంధించిన ఇంజనీర్లు ప్రతిరోజు పనుల పురోగతిపై సమీక్షిస్తూ ఈ నెలాఖరులోగా భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సమన్వయం తో అధికారులు పనిచేస్తూ అన్ని పనులను పూర్తి చేయాలని సూచించారు. 

అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఆర్వో వసంత కుమారి, డిపిఓ శ్రీలత, కాటారం ఆర్డిఓ రవీందర్, విద్యుత్ శాఖ డీఈలు పాపిరెడ్డి, జగదీష్, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు, ఆర్ అండ్ బి ఈ ఈ రమేష్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఇంజనీర్ శివరాం, మల్హర్ తహసీల్దార్ రవికుమార్, సర్వే టీము సభ్యులు తదితరులు పాల్గొన్నారు.