రాష్ట్రంలో ‘సర్’ పొడిగింపు
- ఆగస్టు 3 వరకు ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ గడువు
- ఆగస్టు 10న ఓటర్ల ముసాయిదా జాబితా
- అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితా విడుదల
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి) : తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్-సర్) గడువును కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పొడిగించింది. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నిక సంఘం బుధవారం ప్రకటించింది. వచ్చే ఆగస్టు 3వ తేదీ వరకు ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించనున్నట్లు ఈసీఐ తెలిపింది.
ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన విడుదల చేయనుంది. ఆగ స్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టనుంది. అక్టోబర్ 10వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరించనుంది. అక్టోబర్ 12న తుది ఓటర్ జాబితాను ప్రచురించనుంది.
పొడించాలని విజ్ఞప్తులు..
సర్ గడువును పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కూడా విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రంలో ఎన్నికల సవరణ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డిని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లగా.. వారు కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యర్థనలను పంపారు.
ఈ క్రమంలోనే షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు జూలై 25 వరకు ఉండగా, రాజకీయ పార్టీల అభ్యర్థనల మేరకు గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సవరించిన సర్ షెడ్యూల్‌ను రాజకీయ పార్టీలకు తెలియజేయాలని ఈసీఐ జారీచేసిన ఆదేశాల్లో స్పష్టంచేసింది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ‘సర్’ గడువును ఈనెల 24 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
సవరించిన షెడ్యూల్..
* ఆగస్టు 3 వరకు ఎన్యూమరేషన్ - ఫారాలు స్వీకరణ
* ఆగస్టు 10న మూసాయిదా - ఓటర్ల జాబితా ప్రకటన
* ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ - 9 వరకు అభ్యంతరాల స్వీకరణ
* అక్టోబర్ 10న అభ్యంతరాల - పరిష్కారం
* అక్టోబర్ 12న తుది - ఓటర్ జాబితా విడుదల






