గ్యాస్ కోసం పడిగాపులు
- ఏజెన్సీ కేంద్రాల వద్ద బారులు
ఖాళీ సిలిండర్లతో ఎదురుచూపులు
సంగారెడ్డి, మార్చి 13 :సంగారెడ్డి జిల్లాలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇరాన్, అమెరికా యుద్దం వల్ల నెలకొన్న సంక్షోభం వల్ల భారతదేశానికి గ్యాస్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్తో పాటు గృహావసర గ్యాస్ కూడా కొరత ఏర్పడింది. ఓ వైపు గ్యాస్ కొరత లేదని చెబుతున్నా బుక్ చేసి రోజులు గడుస్తున్నా గ్యాస్ బండ ఇంటికి చేరడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. సంగారెడ్డి పట్టణంలో ప్రతీరోజు వివిధ కంపెనీలకు చెందిన గ్యాస్ ఏజెన్సీ కేంద్రాల వద్ద వినియోగదారులు ఖాళీ సిలిండర్లు పట్టుకొని ఎదు రుచూస్తున్నారు.
గ్యాస్ బుక్ చేసి ఐదు రోజులైనా సిలిండర్ రాకపోవడంతో ఏజెన్సీ వద్దకు క్యూ కడుతున్నారు. ఉదయం నుంచి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఖాళీ సిలిండర్లతో ప్రత్యక్షమవుతున్నారు. దీం తో ఏజెన్సీ తెరవగానే ఒక్కసారిగా వినియోగదారులు ఎగబడుతున్నారు. ఇలావుండగా మరికొందరికి ఈ-కేవైసీ చేసుకోక పోవడంతో సిలిండర్ బుక్ కావడం లేదని వాపోతున్నారు. రానున్న రోజుల్లో యుద్దం ప్రభావం వల్ల గ్యాస్ కొరత తీవ్రమయ్యే పరిస్థితులు ఏర్పడనున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




