calender_icon.png 12 February, 2026 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటమి భయంతోనే దౌర్జన్యకాండ

12-02-2026 02:57:40 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): గత రెండేళ్ల పాలనలో ఘోరమైన వైఫల్యాలను మూటగట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఓటమి భయంతోనే మున్సిపల్ ఎన్ని కల్లో దౌర్జన్యకాండకు దిగారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలను ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఎండగట్టారు.

ఎన్నికల్లో అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టిం చినా, ప్రలోభాలకు గురిచేసినా మొక్కవోని దీక్షతో వీరోచితంగా పోరాడిన బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఆయన పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అక్రమం గా లూటీ చేసిన వేల కోట్ల ప్రజాధనంతో ప్రజాతీర్పునే మార్చాలని చూస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపులకు, దాడులకు రేవంత్ రెడ్డి త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన హామీలను, పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం ముఖ్యమంత్రిని నిత్యం వెంటాడుతుందని ఎద్దేవా చేశారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.