దౌర్జన్యకాండ!
- ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమా?
- మన ప్రభుత్వం వచ్చాక ఈ స్థలంలోనే మీకు ఇల్లు కట్టిస్తాం
- 4,000 మంది పోలీసులతో దాడి దురదృష్టకరం
- ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసితులతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఖమ్మం, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూలగొట్టడమేనని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూ నిర్వాసితులను గురువారం ఆయన కలుసుకు కొని ఓదార్చారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు కేటీఆర్‌కు తమగోడును వెల్లబోసుకున్నారు. జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు బాధితులను పరామర్శించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు.
ఇళ్ల కూల్చివేతతో సంబంధంలేని ఆర్డీవోను ఆకస్మికంగా బదిలీ చేయడం ద్వారా వారి పనితీరు తెలుస్తుందన్నారు. ‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ స్థలంలో నే మీకు ఇల్లు కట్టించి ఇస్తాం. ఈ విషయం కేసీఆర్ మీకు చెప్పి రమ్మన్నారు’ అని కేటీఆర్ భూదాన్ భూముల బాధితులతో అన్నారు. జిల్లా మంత్రులు విలాసవంతమైన విల్లాలు కట్టుకునేందుకు ఒక పథకం ప్రకారం పేదల గూడు చెదరగొట్టారని అన్నారు.
వెలుగుమట్లలో భూదాన్ భూము ల్లో ఇల్లు కూలగొట్టిన ప్రదేశాన్ని సందర్శించి బాధితుల వివరాలు ఆయన సేకరించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమా?, 4,000 మంది పోలీసులతో మీ మీద దౌర్జన్యం చేయడం దురదృష్టకరం అని ఆయన అన్నారు. మీరు ఏమీ అధైర్య పడవద్దని, మీ వివరాలన్నీ మా వద్ద ఉన్నాయని, గతంలో మీకు పట్టాలు ఇచ్చినా, ఈ ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు.
మీకోసం మేము కొట్లాడుతామని, మీకు న్యాయం జరిగేందుకు సుప్రీం కోర్టుకైనా వెళ్తామని ఆయన చెప్పారు. ఎంత ఖర్చునా మా పార్టీ పెట్టుకుంటుందని భరోసానిచ్చారు. మరో రెండేళ్లలో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తదని అప్పుడు ఇక్కడే మీకు పక్కా ఇల్లు కట్టిస్తామని ఆయన అన్నారు. అనంతరం ఖమ్మం లోని అంబేద్కర్ భవన్‌లో బాధితుల కోసం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు.
కూలగొట్టిన ఇళ్ల కాడికి వెళ్లి చూసి వచ్చానని, ఇది తీవ్ర అన్యాయమని, మన లాయర్ అన్ని విషయాలు వివరించారని.. మీరు ఏమి భయపడవద్దని వారిని ఓదార్చారు. కుతంత్రాల కాంగ్రెస్ పార్టీ మీ అందరిని విడగొట్టేందుకు ప్రయత్నం చేస్తుందని, మీరు అందరూ కలిసికట్టుగా ఉండాలని.. మీ వెనక మేము ఉన్నామని ఆయన భరోసానిచ్చారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే, సండ్ర వెంకట వీరయ్య, బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.




