8 May, 2026 | 2:10 AM

త్వరితగతిన డిండిని పూర్తిచేయాలి

08-05-2026 01:13 AM
  1. ఎస్‌ఎల్‌బీసీ కాలువల సామర్థ్యాన్ని మరింత పెంచండి
  2. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): డిండి ఎత్తిపోతల పథకం ఆఫ్ టెక్ పాయింట్‌కు సంబంధించిన లెవల్ ఫిక్సేషన్ తక్షణమే పూర్తిచేసి ప్రాజెక్టును వేగ వంతంగా పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఏఎంఆర్‌పీ కాలు వల సామర్థ్యాన్ని పెంచాలని ఆయన అధికారులకు సూచించారు.

డిండి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై గురువారం సచివాలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి ఈ శ్రీధర్, జాయింట్ సెక్రటరీ కే శ్రీనివాస్, ఈఎన్సీ రమే ష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు- ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఎదుళ్ల రిజర్వాయర్ నుండి ఎత్తిపోతల స్కీం అప్రోచ్ ఛానల్‌కు నీటిని ఏ స్థాయిలో తీసుకురావాలనే అంశంపై తుదినిర్ణయం తీసుకోవాలని చెప్పారు. పోతిరెడ్డిపల్లి గ్రామంలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బ్యారేజ్ పనులను మే 15 నాటికి ఆర్థిక సంబంధిత అనుమతులు తీసుకుని వెంటనే పనులు ప్రా రంభించాలన్నారు.

ఏఎంఆర్పీ ఎస్‌ఎల్బీసీ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2400 క్యూసెక్కుల నుంచి 4000 క్యూసెక్కులకు పెంచాల్సిన అవసరాన్ని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనంతరం సిమెంట్ కాం క్రీట్ లైనింగ్ పనులను చేపట్టాలని ఆయన సూచించారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ సామర్థ్యాన్ని 6000 క్యూసెక్కులకు మరింత పెంచాల్సిన అవసరం ఉండొచ్చని పేర్కొన్నారు.  ఎస్‌ఎల్‌బీసీ హై లెవల్ కాలువకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనుల కోసం ప్రభుత్వం రూ.443 కోట్లు మంజూరు చేసిందన్నారు.

అయితే లైనింగ్ పనుల కంటే ముందుగా కాలువ విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 228 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలను కవర్‌చేస్తూ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నీటి సమస్యలకు పరిష్కారం లభించనుందని ఆయన తెలిపారు. అదేవిధంగా 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. ఈ పథకం కింద మొత్తం 25.31 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నాలుగు ఆన్లైన్ రిజర్వాయర్లు, ఐదు ఆఫ్లైన్ రిజర్వాయర్లు నిర్మించనున్నట్టు వెల్లడించారు.

ఈ పథకానికి సంబంధించిన హెడ్‌వర్క్‌లను నాలుగు ప్యాకేజీలుగా విభజించగా, అందులో పోతిరెడ్డిపల్లి గ్రామంలోని బ్యారేజ్, 16 కిలోమీటర్ల టన్నెల్ కూడా ఉన్నాయన్నారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సంబంధించిన పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 95 శాతం పనులు పూర్తి చేసిందని ఆయన చెప్పారు. ఇందులో అధిక భాగం ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సాధించిన పురోగతేనని మంత్రి తెలిపారు.

అయితే మూడు గ్రామాల పునరావాస సమస్యలు, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 180.14 హెక్టార్ల అటవీ భూమికి సంబంధించిన సమస్యల కారణంగా స్పిల్‌వేలో ఒక భాగం ఇంకా పూర్తికాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ అటవీ భూమికి సంబంధించిన తొలి దశ అటవీ అనుమతులు మరో నెల రోజుల్లో వచ్చే అవకాశం ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు గేట్ల ఏర్పాటు కోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.

పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తిచేసేందుకు సవరించిన అంచనాల తయారీ పురోగతిని కూడా ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్షించారు. దీనిని హై పవర్డ్ కమిటీ ముందుంచాలని ఆయన అభిప్రాయపడ్డారు. తదుపరి మంత్రివర్గం సమావేశంలో దీనిని ప్రవేశపెట్టేందుకు నివేదికలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.