తుమ్మిడిహట్టిపై దూకుడు
- బరాజ్ నిర్మాణానికి కసరత్తు వేగవంతం
- మహారాష్ట్రతో చర్చలకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- ప్రాజెక్టు అనుమతులపై ఢిల్లీలో చర్చించిన సీఎం!
- నేడు తుమ్మిడిహట్టిలో మంత్రుల బృందం పర్యటన
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మించడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేస్తుంది. మహారాష్ట్రతో పెండింగ్‌లో ఉన్న అంశాల పరి ష్కారానికి చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు అధికారవ ర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో కేంద్రం అనుమతులు కూడా తప్పనిసరి కావడంతో ఢిల్లీస్థాయిలోనూ తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో శుక్రవారం మంత్రుల బృందం తుమ్మిడిహట్టిలో పర్యటించనుంది. ముఖ్యమంత్రి ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ అధికారులతో జరిగిన చర్చల అనంతరం మంత్రుల బృందం ఈ పర్యటన చేస్తుండడంతో ఇటు రాజకీయ, అటు పరిపాలనా వర్గా ల్లో ప్రాధాన్యత ఏర్పడింది. గోదావరి జలాల వినియోగం, ఉత్తర తెలంగాణ సాగునీటి అవసరాలు, భవిష్యత్ నీటి భద్రత లక్ష్యంగా ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి ప్రాజెక్టును మళ్లీ ముందుకు తీసు కురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలి సిందే.
ఈ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర జలాలకు సంబంధించినది కావడంతో కేంద్ర జల సంఘం, పర్యావరణ అనుమతులు, అట వీ క్లియరెన్స్‌లు, గోదావరి బోర్డు సమన్వయం వంటి అంశాలు అత్యంత కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే సీఎం తాజా ఢిల్లీ పర్యటనలో తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణంపై కేంద్ర సంస్థల ప్రతినిధులతో చర్చిం చినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియలను వేగవంతం చేయాలని, మహారాష్ట్రతో చర్చల్లో కేంద్రం సహకరించాలని కోరినట్టు సమాచారం.
వాస్తవానికి మే 7వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి తుమ్మిడిహట్టి పర్యటన ఉన్నప్పటికీ దానిని మరుసటి మరుసటి రోజుకు వాయిదా వేసి, చివరి నిమిషంలో రెండురోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రాజెక్టు విషయంలో రాష్ట్రస్థాయి సమీక్ష కంటే, అనుమతులు, వివాదాల పరిష్కారానికి ముందుగా కేంద్రంతో సమ న్వయం అవసరమనే భావనతోనే కేంద్రం తో సీఎం చర్చించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.
మహారాష్ట్రతో చర్చలకు ప్రయత్నాలు
తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కేంద్రంలో సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు మహారాష్ట్రతోనూ చర్చలకు ప్రయత్నాలు చేస్తున్నది. తుమ్మిడిహట్టి బరాజ్ ప్రాణహిత నదిపై చేపట్టబోయే అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కావడంతో రెండు రాష్ట్రాల మధ్య సమన్వ యం అత్యంత కీలకంగా మారింది.
ముఖ్యం గా ముంపు ప్రాంతాలు, బరాజ్ ఎత్తు, బ్యాక్ వాటర్ ప్రభావం వంటి అంశాలపై మహారాష్ట్ర గతంలో వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు ప్రారంభించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కొత్త సాంకేతిక అంచనాలతో తక్కువ ముంపు వచ్చేలా డిజైన్ మార్పులు, ఎత్తు పరిమితిపై చర్చలు జరిపే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
నేడు తుమ్మిడిహట్టికి మంత్రుల బృందం
తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం మంత్రుల బృందం తుమ్మడిహట్టిలో పర్యటించనుంది. మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, ఆదిలాబాద్ ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తదితర మంత్రులతో కలిసి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి ప్రాంతాన్ని సందర్శించనున్నారు. తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణం, నీటి లభ్యత, ముంపు ప్రభావం, సాగునీటి పారుదల అంశాలపై సమీక్షించనున్నారు.
ఈ సందర్భంగా బరాజ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలు, కాలువల రూపకల్పన, నీటి నిల్వ సామర్థ్యం, భవిష్యత్ సాగునీటి అవసరాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు. ప్రత్యేకంగా మహారాష్ట్రతో అనుసంధానమైన ముంపు సమస్య, పరిహారం అంశాలు, నీటి వినియోగ ఒప్పందాలు వంటి కీలక విషయాలపై కూడా చర్చకు వచ్చే అవకాశముంది.






